రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు గుంటూరు జిల్లా పెదకూర పాడు నియోజకవర్గంలో ఇదే జరుగుతోంది. ఎన్నో ఆశలతో ఇక్కడ వైసీపీని గెలిపించిన ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. గతంలో వరుస విజయాలు దక్కించుకున్న టీడీపీ నాయకుడు.. కొమ్మాలపాటి శ్రీధర్.. అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజల సమస్యలు పట్టించుకున్నారు. వారి సమస్యలు వినేందుకు ఎక్కువ సమయం కేటాయించారు. దీంతో ప్రజలు కూడా ఆయనను వరుసగా ఇక్కడ గెలిపించారు. 2014లో గెలిచాక ఈ నియోజకవర్గంలో ఉన్న అమరావతి పేరు మీదే రాజధాని ఏర్పడడం కూడా ఆయనకు కలిసి వచ్చి కళ్లుచెదిరిపోయేంత అభివృద్ధి చేశారు. అయితే.. 2019లో వైసీపీ సునామీ.. ఒక్కఛాన్స్ పిలుపుతో రాజకీయం మారిపోయింది

దీంతో ఈ నియోజకవర్గంలో కొమ్మాలపాటి ఓడిపోయి.. వైసీపీ తరఫున బరిలో నిలిచిన నంబూరి శంకర్రావు విజయం దక్కించుకున్నారు. అయితే.. ఇప్పటికి ఆయన అధికారంలోకి వచ్చి.. రెండున్నరేళ్లు పూర్తయి నా ప్రజలను పట్టించుకున్నది లేదన్న టాక్ నియోజకవర్గంలో బలంగా వచ్చేసింది. ప్రజల కోసం చేసింది కూడా ఏమీ కనిపించడం లేదు. పైగా.. గుంటూరులో ఉంటూ.. రాజకీయాలు చేస్తున్నారు. దీంతో నియోజకవర్గం ప్రజలు తమ సమస్యలు చెప్పుకొందామన్నా.. గుంటూరుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇంతదూరం రాలేక.. వారు .. ప్రతిపక్షంలో ఉన్నా.. ఓడిపోయినా.. కొమ్మాలపాటినే ఆశ్రయిస్తున్నారు. వారి సమస్యలు ఆయనతోనే పంచుకుంటున్నారు.

కొమ్మాలపాటి కూడా నిత్యం నియోజకవర్గంలోనే తిరుగుతూ ప్రజల సమస్యలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తాను అధికారంలో లేక పోయినా .. ప్రజల సమస్యలపై పోరాడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మరోవైపు.. స్థానికంగా ఎలాంటి అభివృద్ధికి ఎమ్మెల్యే శంకర్రావు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అపవాదు ఆయన ఎదుర్కొంటున్నారు. పైగా.. అందరిపైనా ఆధిపత్యం చలాయించే ధోరణిని ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు.. ప్రతిపక్ష నేతగా ఉన్న కొమ్మాలపాటిని.. నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వనంటూ.. ఆయన చేసిన కామెంట్.. ఆయనకే బూమరాంగ్ అయింది. ప్రజలు ఈ విషయంలో ఎమ్మెల్యేపై నిప్పులు చెరుగుతున్నారు. కొమ్మాలపాటి నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజా సమస్యలపై విస్తృతంగా పోరాటం చేస్తుంటే నియోజకవర్గంలో అడుగుపెట్ట నీయడం అన్నది నియంత వ్యాఖ్యలకు నిదర్శనం అన్న విమర్శలు వస్తున్నాయి.

నిజానికి అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేగా నంబూరుకు ఎంతో ఇక్కడ పనిచేసే అవకాశం ఉంది. నిధులు కూడా తీసుకువచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ.. ఆయన వాటిని పక్కన పెట్టారు. వైసీపీ పాలనలో ఎక్కడా చెప్పుకోదగ్గ పనులు లేవు.. కనీసం చిన్నా చితకా అభివృద్ధి పనులు కూడా జరగడం లేదు. అటు అభివృద్ధి లేదు.. ఇటు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న విమర్శలు శంకర్రావును చుట్టు ముట్టేశాయి. నియోజకవర్గంలో పీఏ, మరో షాడో నేత వ్యవహారాలు చక్క బెడుతున్నారన్న టాక్ నియోజకవర్గంలో బలంగా వచ్చేసింది. ఏదేమైనా సరైన టైంలో కొమ్మాలపాటి దూకుడు ముందు శంకర్రావు బేజారు అవుతున్న పరిస్థితి. అందుకే ఆయన ప్రస్టేషన్‌లోనే నియోజకవర్గంలో అభివృద్ధిపై కొమ్మాలపాటికి సవాళ్లు విసరడం మానేసి ఆయన్ను నియోజకవర్గంలో తిరగనీయనని అంటున్నారన్న వాదనే స్థానికంగా వినిపిస్తోంది.
Discussion about this post