రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు ఇప్పుడుప్పుడే పుంజుకుంటున్నారు. పలు నియోజకవర్గాల్లో వైసీపీకి ధీటుగా టీడీపీ నేతలు వచ్చారు. అయితే రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో 12 జిల్లాల్లో టీడీపీ నేతలు ఏదొక నియోజకవర్గంలో పుంజుకుంటున్నారు. కానీ ఒక్క నెల్లూరు జిల్లాలోనే ఒక్క నియోజకవర్గంలో కూడా టీడీపీ నేతలు పుంజుకున్నట్లు కనిపించడం లేదు. ఉండటానికి బడా నేతలు చాలా ఉన్నారు…కానీ వారి వల్ల ఒక్క ఉపయోగం ఉన్నట్లు లేదు.

మామూలుగానే నెల్లూరు అంటే వైసీపీకి కంచుకోట. గత రెండు ఎన్నికల్లో జిల్లాలో వైసీపీదే హవా. 2019 ఎన్నికల్లో అయితే జిల్లా మొత్తం క్లీన్‌స్వీప్ చేసేసింది. అలా జిల్లా మొత్తం వన్‌సైడ్‌గా వైసీపీ వశమైపోయింది. ఇలా వైసీపీ చేతుల్లో ఉన్న జిల్లాలో టీడీపీ నేతలు ఎంత కష్టపడితే పికప్ అవుతారో అర్ధం చేసుకోవచ్చు. చాలా కష్టపడితేనే గానే జిల్లాలో టీడీపీ పికప్ అవ్వదు. కానీ ఏ నాయకుడు కూడా గట్టిగా కష్టపడుతున్నట్లు కనిపించడం లేదు. అందుకే ఇప్పటికీ కూడా జిల్లాలో టీడీపీ పుంజుకోలేదు.

పోనీ వైసీపీ ఎమ్మెల్యేలు ఏమన్నా గొప్పగా పనిచేస్తున్నారా? అంటే అది లేదు. జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత విపరీతంగా పెరుగుతూ వస్తుంది. ఉదాహరణకు గూడూరులో వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌పై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఆయన పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సరే ఎమ్మెల్యేపై కోపంతో ఉంటే ప్రజలు టీడీపీ వైపు చూస్తున్నారా అంటే అది కనిపించడం లేదు. ఇక్కడ టీడీపీ సైతం ప్రజలని తనవైపుకు తిప్పుకోవడంలో ఫెయిల్ అయినట్లే కనిపిస్తోంది.

ఇలా గూడూరులోనే కాదు పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్తితి. అసలు నెల్లూరు సిటీలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై కూడా వ్యతిరేకత పెరిగిందని పలు సర్వేలు చెప్పాయి. కానీ ఇక్కడ కూడా టీడీపీ పికప్ కాలేదు. అందుకే నెల్లూరు కార్పొరేషన్‌లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఒక్క డివిజన్ కూడా గెలుచుకోలేని పరిస్తితిలో టీడీపీ ఉంది అంటే…నెల్లూరులో తమ్ముళ్ళ పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Discussion about this post