ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో మళ్లీ చంద్రబాబే హైలెట్ కానున్నారు. వాస్తవానికి గత ఎన్నికల తర్వాత.. ఆయన ఒకింత మనోవేదనకు గురయ్యారనేది వాస్తవం. పోయిన నేతలు.. పుంజుకోని నాయకులతో పార్టీ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది. దీనికితోడు కరోనా నేపథ్యంలో ఇంటి నుంచి చంద్రబాబు సైతం బయటకు రాలేక.. రెండేళ్లపాటు పార్టీ తీవ్ర సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంది. అయితే.. ఆ సమయంలోనూ ఆయన ఆన్‌లైన్ ద్వారా పార్టీని పుంజుకునేలా చేశారు.

ఎప్పటికప్పుడు పార్టీ నేతలతో ఆయన చర్చించారు. ప్రతి విషయాన్నీ.. ఆయన పరిశీలించారు. క్షేత్రస్థాయి లో పరిస్థితిని బాగు చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అంతేకాదు.. పార్టీకి అన్నీతానై వ్యవహరించారు. ఇప్పుడు ఏకంగా .. ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న పార్టీ నేతలు.. పుంజుకునేందుకు ముందుకు వస్తున్నారు. నాయకుడే కదిలిన తర్వాత.. తాము నిలకడగా కూర్చుంటే.. రేపు కూసాలు కదిలిపోవడం ఖాయమనే భయం నాయకుల్లో కలిగించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

“మా నాయకుడే కదిలారు. ఈ వయసులో ఆయన చేస్తున్న కృషిని అందరూ అందిపుచ్చుకుంటారనే భావిస్తున్నాం“ అని ఒక నాయకుడు వ్యాఖ్యానించారు. ఈ తరహా ఆలోచన రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ కనిపిస్తోంది. ప్రతి ఒక్కరినీ.. ఆయన కదిలిస్తున్నారు. మరోవైపు.. చంద్రబాబు తనయుడు.. లోకేష్ కూడా త్వరలోనే పాదయాత్రకు సిద్ధమవుతున్నారన్న వార్తలు కూడా పార్టీలో జోష్ పెంచుతున్నాయి.

చంద్రబాబు గతంలో చేసిన పాదయాత్ర వల్లే పార్టీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఆ నాటి జోష్ ఇప్పుడు మళ్లీ వస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలు ఎన్నో ఆశలతో ఉన్నారు. తాజా పరిణామల నేపథ్యంలో పార్టీకి మళ్లీ చంద్రబాబు కర్త, కర్మ, క్రియగా మారారని.. పార్టీ పుంజుకుంటుందని.. తిరిగి 2014నాటి వైభవం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Discussion about this post