ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి…మొన్నటివరకు అధికార వైసీపీకి పూర్తిగా అనుకూలంగా ఉన్న రాజకీయం…ఇప్పుడుప్పుడే మారుతుంది. ప్రతిపక్ష టీడీపీ కూడా ఊహించని విధంగా పుంజుకుంటుంది. వైసీపీ లీడ్‌లో ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ లీడ్‌లోకి వస్తుంది. అయితే కొన్ని చోట్ల టీడీపీ సిట్టింగ్ సీట్లు ఉన్న విషయం తెలిసిందే. ఆ సీట్లలో కూడా మార్పు కనిపిస్తోంది. కొన్ని టీడీపీ సిట్టింగ్ సీట్లలో వైసీపీ పట్టు తెచ్చుకుంటుంది.

ఇదే క్రమంలో పెద్దాపురం నియోజకవర్గంలో వైసీపీ పట్టు తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది. మామూలుగా పెద్దాపురం టీడీపీకి కంచుకోట…ఇక్కడ ఎక్కువసార్లు టీడీపీ జెండా ఎగిరింది. ఇక గత రెండు పర్యాయాలుగా టీడీపీ తరుపున చినరాజప్ప విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే ఈ సారి కాస్త రాజప్పకు వ్యతిరేక వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే పెద్దాపురంలో వైసీపీ పట్టు సాధించింది. స్థానిక ఎన్నికల్లో వైసీపీ మంచి విజయాలని అందుకుంది.దీని బట్టి చూస్తే పెద్దాపురంలో వైసీపీకి మంచి పట్టు దొరికిందనే చెప్పాలి. ఈ సారి ఎన్నికల్లో రాజప్పకు వైసీపీ గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. కాకపోతే రాష్ట్రంలో గానీ టీడీపీ వేవ్ ఉంటే రాజప్పకు మళ్ళీ గెలిచే అవకాశాలు వస్తాయి. లేదంటే పోటాపోటి వాతావరణం ఉంటే రాజప్ప గెలుపుకు ఇబ్బంది అవుతుంది. అయితే ఇక్కడ రాజప్పకు ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే…పవన్ కల్యాణ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో పవన్, టీడీపీకి సపోర్ట్ ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతుంది.

అదే జరిగితే రాజప్పకు మరొకసారి ఛాన్స్ దొరకొచ్చు. 2014లో పవన్ సపోర్ట్ ఉండటంతో..పెద్దాపురంలో 10 వేల మెజారిటీతో రాజప్ప గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో రాజప్ప 4 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ అప్పుడు జనసేన సెపరేట్‌గా పోటీ చేసింది. పెద్దాపురంలో జనసేనకు 25 వేల ఓట్లు వచ్చాయి. అంటే నెక్స్ట్ గానీ పవన్, టీడీపీకి సపోర్ట్ చేస్తే రాజప్పకు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.
Discussion about this post