టీడీపీలో ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది. నో డౌట్.. పార్టీ అధికారంలోకి రాగానే.. హోం శాఖను ఆమెకే ఇస్తారు! అని కొందరు ఔత్సాహిక నాయకులు కామెంట్లు చేస్తున్నారు. ఆమే.. తెలుగు మహిళ అధ్యక్షురాలు.. మాజీ ఎమ్మెల్యే వంగల పూడి అనిత. 2014లో రాజకీయ అరంగేట్రం చేసిన వంగలపూడి అనతి కాలంలోనే పుంజుకున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే.. ఫైర్ బ్రాండ్ రాజకీయాలకు కేరాఫ్‌గా పనిచేశారు. తర్వాత.. గత ఎన్నికలకు ముందు నియోజకవర్గం మారడంతో.. గెలుపు గుర్రం ఎక్కలేక పోయినా.. అధినేతను అభ్యర్థించి.. తిరిగి తన పాత నియోజకవర్గం పాయకరావు పేటకు వెళ్లిపోయారు.

పార్టీ తరఫున గట్టి వాయిస్ వినిపిస్తున్నారు. ఇదేసమయంలో పార్టీ లో అందరినీ కలుపుకొని వెళ్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఆమెకు తెలుగు మహిళ అధ్యక్షరాలిగా పగ్గాలు అప్పగించారు. నిజానికి ఇప్పటి వరకు ఎస్సీ సామాజిక వర్గానికి ఈ పదవిని ఇవ్వలేదు. కానీ, అనిత దూకుడును గుర్తించిన చంద్రబాబు ఆమెను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తొలిసారి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అనితకు తెలుగు మహిళ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించారు. ఇక, అప్పటికే పార్టీ తరఫున మంచి వాయిస్ వినిపించిన అనిత.. తర్వాత.. తనకు అప్పగించిన బాధ్యతలతో మరింత దూకుడు పెంచారు.

వైసీపీ సర్కారులో ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా.. స్పందిస్తున్నారు. గతంలో విశాఖ డాక్టర్ సుధాకర్ విషయంలో పోలీసు లు నడిరోడ్డుపై చేసిన అఘాయిత్యాన్ని ఆమె స్వయంగా హైకోర్టుకు లేఖ రూపంలో రాసి.. విచారణకు తీసుకువచ్చారు. దీంతో సర్కారు ఆత్మరక్షణలో పడింది. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. మరోవైపు.. మహిళలకు ఎక్కడ ఎలాంటి అన్యాయం జరుగుతున్నా.. అనిత్ రియాక్ట్ అవుతున్నారు. వారి తరఫున పోరాడుతున్నారు.

తాజాగా విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో జరిగిన అఘాయిత్యాలపై ఉద్యమ స్ఫూర్తి ప్రదర్శించారు. అదేసమయంలో మహిళల్లో చైతన్యం తెచ్చేందుకు `నారీ సంకల్ప దీక్ష` పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు అనంతపురంలోనూ నిర్వహించారు. వచ్చే ఎన్నికల లోపు.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లోనూ నిర్వహించాలని భావిస్తున్నారు.

ఇక, పార్టీ తరఫున గట్టి వాయిస్ వినిపిస్తున్నారు. వీటికితోడు తాజాగా జగన్ పాలనలో 800 మందిపై అఘాయిత్యాలు జరిగాయని పేర్కొంటూ.. “ఊరికో ఉన్మాది` పేరుతో పుస్తకాన్ని ముద్రించారు. ఇలా.. అన్ని రూపాల్లోనూ అనిత విజృంభిస్తున్నతీరును గమనిస్తున్న నాయకులు. టీడీపీ అధికారంలోకి రాగానే.. అనితకు గ్యారెంటీగా హోం శాఖను అప్పగిస్తారని.. అంటున్నారు. మరి ఇది ఇప్పుడు సరదాగానే అంటున్నా.. భవిష్యత్తులో నిజం కావొచ్చేమో!!

Discussion about this post