ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గంలో ఇప్పుడు ఇదే టాక్ వినిపిస్తోంది. అప్పట్లో ఎన్టీఆర్ వెళ్లిన దారిలోనే ఇప్పుడు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వెళుతున్నారన్న టాక్ జిల్లాలో వినిపిస్తోంది. ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్నన్నాళ్లు పేదలకు, రైతులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. కీలకమైన గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను కలుసుకునేందుకు, వారి సమస్యలు పరిష్కరించేందుకు ఎన్టీఆర్ ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రధానంగా రైతులకు అన్నివిధాలా అండగా ఉండేవారు.

అదే సమయంలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చేవారు. దీంతోనే ఎన్టీఆర్ ప్రజానాయకుడిగా అనతికాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు అచ్చు అదేవిధంగా పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కూడా తన నియోజకవర్గం పరిధి లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు అన్ని విధాలా అండగా ఉంటున్నారు. వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నామని… కానీ, తాను చేయలేనని కానీ.. ఎక్కడా ఏలూరి తప్పించుకునే ప్రయత్నం చేయడం లేదు. అంతేకాదు.. ఎన్నారైల నుంచి నిధులు సేకరించి రైతులకు సమయానికి అనుకూలంగా సాయం అందిస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అదేవిధంగా టీడీపీ బలోపేతానికి ఏలూరి కృషి చేస్తున్నారు. అట్టహాసాలు, ఆడంబరాలకు దూరంగా.. తాను ఎమ్మెల్యే అయినా.. ప్రజలకు సేవ చేయడంలో సాధారణ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు.

దీంతో ప్రజలకు.. ఏలూరికి మధ్య సంబంధాలు వ్యక్తిగతంగా మారడం విశేషం. సాధారణంగా.. ఒక నాయకుడికి ప్రజల్లో వ్యక్తిగత బంధం ఏర్పడడం అత్యంత అరుదుగా ఉంటుంది. ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రకాశం జిల్లాలో ఎంతో మంది నేతలు గతంలో రైతులు, గ్రామీణ ప్రజానీకంతో మమైకమై వారి కష్టసుఖాల్లో ప్రత్యక్షంగా పాలు పంచుకునేవారు. ఇప్పుడు ఏలూరి ఈ కోవలో కనిపిస్తుండడం గమనార్హం. ఏదేమైనా పరుచూరు నియోజకవర్గ రాజకీయాల్లో పార్టీలతో సంబంధం లేకుండా ఏలూరి ప్రజల మనిషిగా తనదైన ముద్ర వేసుకుంటున్నారు.

Discussion about this post