మచిలీపట్నం వేదికగా జనసేన 10వ ఆవిర్భావ సభ జరగనున్న విషయం తెలిసిందే. ఈ సభతో జనసేనకు కాస్త ఊపు తీసుకురావడం, వైసీపీపై విరుచుకుపడటం, టిడిపితో పొత్తుపై పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక బందరు వేదికగా సభ జరగడంతో అక్కడ జనసేన శ్రేణుల్లో సందడి నెలకొంది. బందరులో జనసేన బలం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
అయితే ఎంత బలం పెరిగిన..సింగిల్ గా మాత్రం బందరులో జనసేన గెలవడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఆ పార్టీకి బందరులో అనుకున్న మేర బలం లేదు. ఏదో కాపుల వరకు జనసేనకు సపోర్ట్ ఇస్తారు. అది కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ రాదు. కాబట్టి పవన్ సభ జరిగినా సరే బందరులో జనసేనకు ఒరిగేది ఏమి లేదు. ఒకవేళ కొన్ని ఓట్లు పెరిగినా..టిడిపితో పొత్తు ఉంటే ఆ పార్టీకే బెనిఫిట్ అవుతుంది. అయితే టిడిపితో పొత్తు ఉంటే బందరు సీటు మాత్రం టిడిపికే దక్కనుంది. ఇక్కడ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు.

గత ఎన్నికల్లో ఆయన 5 వేల ఓట్ల మెజారిటీతోనే ఓడిపోయారు. అప్పుడు జనసేన 20 వేల ఓట్ల వరకు చీల్చింది. దీని వల్ల టిడిపికి నష్టం జరిగింది. అయితే ఈ సారి టిడిపి-జనసేన పొత్తు సెట్ అయ్యేలా ఉంది. అదే జరిగితే బందరులో వైసీపీకి గెలుపు కష్టమే. ఇక వైసీపీ నుంచి మాజీ మంత్రి పేర్ని నాని పోటీ చేస్తారో లేక ఆయన వారసుడు పేర్ని కృష్ణమూర్తి పోటీ చేస్తారో మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు.
ప్రస్తుతానికి మాత్రం పేర్ని వారసుడు తిరుగుతున్నారు. అయితే ఎవరు పోటీ చేసిన టిడిపి-జనసేన పొత్తు ఉంటే గెలవడం కష్టం. పొత్తు లేకపోతే కాస్త అవకాశాలు ఉంటాయి. కానీ వైసీపీపై వ్యతిరేకత టిడిపికి ఉన్న పాజిటివ్ తో..టిడిపికే గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి.
