ప్రజలే, ప్రజల చేత, ప్రజల కొరకు.. ఇదీ మన ప్రజాస్వామ్యం.. Democracy..
కానీ పాలకులు ఈ సిద్ధాంతాన్ని వదిలి.. విధ్వంసంతో అరాచక పాలన సాగిస్తుంటే..
అప్పుడు ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత.. సత్యాన్ని ఎలుగెత్తి చాటాల్సిన ఆవస్యకత
కచ్చితంగా మీడియాదే. let the truth prevail..
ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ, ఎంతో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ 2 సందర్భాల్లో మీడియా చాలా కీలకపాత్ర పోషించింది.
వీటిల్లో ఒకటి 30 ఏళ్ల కిందట జరిగితే మరొకటి ఇప్పుడు జరిగింది.
ముందుగా ఇప్పటి అమరావతి రైతుల చారిత్రక విజయం విషయానికి వద్దాం.. టీవీ5 గురించి చెప్పుకుందాం..
అమరాతి ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఏపీ ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేసింది.. రైతులపై, మహిలపై, వృద్ధులపై, దళితులపై.. ఈ 810 రోజుల్లో కొన్ని వేల కేసులు పెట్టారు.. ఉక్కుపాదం మోపుతున్న పాలకులతో రాజధాని 29 గ్రామాల్లో ప్రతిరోజూ యుద్ధమే.. కోర్టుల్లో న్యాయం గెలుస్తుందనే నమ్మకం ఉన్నా.. ఏళ్లకు ఏళ్లు గడిచిపోతుంటే.. నిరాశా నిస్ఫ్రుహలు అలముకుంటుంటే.. ఆ భారమైన క్షణాల్ని దాటి ముందడుగు వేయడం సామాన్యమైన విషయం కాదు.. ఈ విషయంలో మహిళలు చాలా ధైర్యం చూపించారు. అహింసే మన విధానమైతే.. భవిష్యత్తు అంతా మహిళలదే అన్నారు మహాత్మాగాంధీ. అలాంటి అహింసనే ఆయుధంగా చేసుకుని పోరాడారు. వారు ఉద్యమ జెండా పట్టినప్పటి నుంచి వెన్ను దన్నుగా నిలిచంది ఎవరంటే వెంటనే గుర్తొచ్చేది టీవీ5, ఆ సంస్థ ఛైర్మన్ బీఆర్ నాయుడు. అమరావతి పరిరక్షణే ఆంధ్రప్రదేశ్ పరిరక్షణగా ఆయన ఆ బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఈ పరిస్థితుల్లో మద్దతుగా నిలిచినందుకు వేధింపులకు గురి చేశారు.. కేసులని, నోటీసులని బెదిరించి భయపెట్టాలని చూశారు..

కానీ.. టీవీ5 మొండిగా తలపడింది. ఆర్థికంగానూ అష్టదిగ్భందం చేయాలని ప్రయత్నిస్తే తట్టుకుని ధైర్యంగా నిలబడింది. ఉద్యమం మొదలైన తొలి రోజు నుంచి నేటి వరకూ టీవీ5 కెమెరా ప్రతిరోజూ రాజధాని అమరావతి వార్త కవర్ చేసింది. లెక్కలేనన్ని డిబేట్లు పెట్టింది. రైతుల ఆవేదన.. వారి పోరాటంలో నిజాయతీ కనిపిస్తుంటే.. అందుకు పూర్తి మద్దతు ఇవ్వాలని భావించి టీవీ5 ఛైర్మన్ బీఆర్ నాయుడు కూడా స్వయంగా ఉద్యమంలో పాల్గొన్నారు. టీవీ5కి రాజధానిలో వీసమెత్తు భూమి కూడాలేదు.. ఇతర ఆస్తులూ లేవు.. కేవలం రైతుల కష్టాలు చూసి చలించి ఉద్యమానికి బాసటగా నిలిచారు. చివరికి ఇప్పుడు అన్ని కుట్రలనూ ఛేదించి ఉద్యమం చరిత్ర సృష్టించింది. ఒక చరిత్రను తిరగరాసింది. ముమ్మాటికీ ఇది చారిత్రక విజయం.. ఎన్నో భవిష్యత్ ఉద్యమాలకు దిక్సూచి.
నిజానికి మిగతా మీడియా ఛానల్స్, పేపర్లు కూడా అమరావతి వార్త కవర్ చేశాయి. మొదటి నాలుగు రోజులు హెడ్ లైన్ వార్తగా ఉంచాయి. తర్వాత కొన్నాళ్లకు బులెటిన్ లో మామూలు వార్త అయిపోయింది. ఆ తర్వాత కవరేజీ పూర్తిగా వదిలేశాయి. 100 రోజులనో, 300 రోజులనో, 500 రోజులనో, న్యాయస్థానం నుంచి దేవస్థానం అనో ప్రత్యేక సందర్భాలుంటే తప్ప కవర్ చేయడమే మానేశాయి. కొన్ని పత్రికు, ఛానెళ్లు అదీ చేయలేదు. కానీ టీవీ5 మాత్రం ప్రతిరోజూ అమరావతి పక్షాన నిలబడింది. అక్షరమే ఆయుధంగా చేసుకుంది. పాలకులు చేస్తున్న ప్రతి కుట్రనూ 5 కోట్ల ఆంధ్రులకు తెలిసేలా చేసింది. అమరావతి ప్రజల గొంతుకకు తనే మైకు అయ్యింది. ప్రతిదృశ్యానికీ టీవీ5 కెమెరానే కన్ను అయ్యింది. ఆంధ్రప్రదేశ్ అభివ్రుద్ధికి, అమరావతికి మళ్లీ ప్రాణం పోసే వరకూ నిరంతరం పోరాడింది. ఈ ఉద్యమం ఇక్కడితో అయిపోలేదు.. ఇకపైనా ఈ ఉద్యమం గురించి చెప్పాల్సి వస్తే అమరావతిని- టీవీ5ని వేరు చెప్పలేనంతగా ముద్ర పడింది.
ఇక 30 ఏళ్ల కిందటి సారా ఉద్యమాన్నీ, ఈనాడు దాన్ని నడిపించిన తీరును మెచ్చుకోవాల్సిందే.
నాడు 1992 సారా వ్యతిరేక ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలబడ్డారు రామోజీరావు. సారాపై సమరం పేరుతో ప్రతి రోజు నాలుగు పేజీలు ప్రత్యేకంగా కేటాయించి అనేక కథనాలు ప్రచురించారు. ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ ప్రతి రోజు ఒక కార్టూన్ వేశారు. అనేక సభలు, సమావేశాలు కూడా నిర్వహించారు. నెల్లూరులో మొదలైన ఉద్యమం రాష్ట్రమంతా వ్యాపించింది. చివరికి ప్రజల ఉద్యమానికి, ముఖ్యంగా మహిళల ఉద్యమానికి తలొగ్గి నాటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సారా నిషేధం విధించింది. అప్పటికే ఈనాడుకు ఎంతో గుర్తింపు ఉన్నా.. ఈ ఉద్యమ విజయంతో పత్రికారంగంలో మరో మెట్టు పైకి ఎక్కింది. నాటి ఉద్యమంలో మహిళలదే కీలకపాత్ర. నేడు అమరావతిలోనూ మహిళలే ప్రధాన భూమిక పోషించారు. వారే ముందుండి ఉద్యమాన్ని నడిపారు.
అప్పుడు రామోజీరావు, ఇప్పుడు బీఆర్ నాయుడు ప్రజల పక్షాన నిలబడి ఉద్యమానికి దన్నుగా నిలబడ్డారు. ఈ నాలుగైదు దశాబ్దాల్లో మీడియా ఒక ప్రజా ఉద్యమాన్ని తల ఎత్తుకొని పోరాడి, చివరికి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన ఘటనలు ఈ రెండే అని చెప్పుకోవచ్చు… ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు. నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుకాక అని నమ్మిన ఈనాడు రామోజీరావు కావచ్చు, వాస్తవాలకు ప్రతిరూపం టీవీ5 అని చెప్పే బీఆర్ నాయుడు కావచ్చు.. రాజకీయాలకు అతీతంగా ఈ ప్రజా ఉద్యమాలకు మద్దతు ఇచ్చారు. న్యూస్ ఈజ్ పీపుల్. ప్రజలే వార్తలు. కాబట్టే ప్రజాపక్షాన నిలుస్తూ అందరి అభిమానాన్ని పొందగలిగారు. ఏమాత్రం రాజకీయాలకు తావులేనటువంటి నాటి సారా వ్యతిరేక ఉద్యమం.. ఇప్పటి అమరావతి పరిరక్షణ వంటివాటిలో ఈనాడు, టీవీ ఫైవ్ పాత్ర భవిష్యత్తు లో మీడియా అనుసరించే మార్గాలకు, భవిష్యత్తులో మీడియా ధోరణులకు ఒక మార్గదర్శకం అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం
ఎన్నో సందర్భాల్లో మీడియా తన పాత్రను సమర్థంగా పోషించినా.. ఒంటరిగా పోరాటం మొదలుపెట్టి చివరి వరకూ దాన్ని తీసుకెళ్లి గెలిపించింది అతి తక్కువ సందర్భాల్లోనే. అందులో ఈ సారా ఉద్యమం, అమరావతి ఉద్యమాలకు ఈనాడు, టీవీ5లు ఇచ్చిన ప్రధాన్యత చరిత్రలో నిలిచిపోతుంది.
Discussion about this post