ఒంగోలు పార్లమెంట్ అంటే వైసీపీకి అనుకూలమైన స్థానం అని చెప్పవచ్చు. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ హవా నడిచింది. అయితే ఇక్కడ టిడిపి గెలిచి చాలా ఏళ్ళు అయింది. 1984, 1999 ఎన్నికల్లోనే అక్కడ టిడిపి గెలిచింది. 1999 ఎన్నికల తర్వాత ఒంగోలులో టిడిపి మళ్ళీ గెలవలేదు. వరుసగా ఓడిపోతూ వస్తుంది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగా, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది.
అయితే 2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు వరకు వచ్చి కేవలం 15 వేల ఓట్ల మెజారిటీ తేడాతో ఓడిపోయింది. కానీ 2019 ఎన్నికల్లో టిడిపి దారుణంగా ఓడింది. దాదాపు రెండు లక్షల 14 వేల ఓట్ల మెజారిటీతో వైసీపీ గెలిచింది. అలా ఒంగోలులో వైసీపీ హవా నడిచింది. కానీ ఇప్పుడు నిదానంగా సీన్ మారుతూ వస్తుంది. వైసీపీకి వ్యతిరేకత పెరుగుతుంది. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్న సగం స్థానాల్లో వైసీపీపై వ్యతిరేకత ఉంది.

పార్లమెంట్ పరిధిలో ఏడు స్థానాలు ఉన్నాయి..యర్రగొండపాలెం, కొండపి, మార్కాపురం, గిద్దలూరు, ఒంగోలు, దర్శి, కనిగిరి స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఒక్క కొండపి తప్ప మిగిలిన స్థానాల్లో వైసీపీ గెలిచింది. భారీ మెజారిటీలు రావడంతో..ఒంగోలు పార్లమెంట్ సీటుని భారీ మెజారిటీతో గెలుచుకుంది. అయితే ఇప్పుడు సీన్ మారుతుంది. వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుండగా, టిడిపి బలపడుతుంది. కొండపి, కనిగిరి, ఒంగోలు స్థానాల్లో టిడిపికి ఆధిక్యం ఉంది. యర్రగొండపాలెం, మార్కాపురం స్థానాల్లో వైసీపీకి ఆధిక్యం ఉంది.
అయితే టిడిపి, జనసేన కలిస్తే దర్శి సీటుని గెలుచుకోవచ్చు. అటు గిద్దలూరులో ప్రభావం చూపవచ్చు. అంటే టిడిపి, జనసేన పొత్తు ఉంటే ఒంగోలు ఎంపీ సీటు వైసీపీకి దక్కడం కష్టం.. ఈసారి టిడిపి కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
