అతి విశ్వాసం…రాజకీయ నాయకులకు ఉండకూడనిది….ఇది ఉంటే ఖచ్చితంగా ఆ నాయకులకు పతనం తప్పదు. ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న కొందరు వైసీపీ నేతలకు అతి విశ్వాసం కాస్త ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఎలాగో అధికారంలో ఉన్నాం…ఇంకా తాము ఏం చేస్తే అదే…తాము ఏం చేసిన ప్రజల మద్ధతు ఉంటుందనే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అందుకే తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కొన్నిచోట్ల ప్రజలు వైసీపీకి షాక్ ఇచ్చారు. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్న నాయకులకు చెక్ పెట్టారు.

అలా ఓవర్ కాన్ఫిడెన్స్‌తో దర్శి, కొండపల్లి మున్సిపాలిటీల్లో వైసీపీ ఓటమి పాలైంది. అధికార బలం కూడా ఇక్కడ వైసీపీని కాపాడలేకపోయింది. అసలు దర్శిలో టీడీపీ గెలుపుని ఎవరూ ఊహించలేదు. ఇది వైసీపీ కంచుకోట…పైగా దర్శిలో టీడీపీకి బలమైన నాయకులు లేరు. ఉన్న నాయకులు వైసీపీలోకి వెళ్ళిపోయారు. దీంతో అక్కడ టీడీపీ గెలుపు సాధ్యం కాదనే అంతా అనుకున్నారు.

కానీ అనూహ్యంగా దర్శి మున్సిపాలిటీలో ఉన్న 20 వార్డుల్లో టీడీపీ 13 వార్డులు, వైసీపీ 7 వార్డుల్లో మాత్రమే గెలిచింది. దీంతో దర్శి మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో పడింది. ఇక్కడ దర్శి వైసీపీ ఎమ్మెల్యే మద్దిసెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. అటు టీడీపీ నుంచి శిద్ధా రాఘవరావు కూడా వైసీపీలోకి వచ్చేశారు. అలాగే గత ఎన్నికల్లో దర్శి నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన కదిరి బాబూరావు సైతం వైసీపీలోకి వచ్చారు. వైసీపీలో ఇంతమంది నాయకులు ఉన్నా సరే ఉపయోగం లేకుండా పోయింది.

ఇటు మైలవరం నియోజకవర్గం పరిధిలో ఉన్న కొండపల్లి మున్సిపాలిటీని కూడా టీడీపీ కైవసం చేసుకుంది. 29 వార్డుల్లో టీడీపీ 14, వైసీపీ 14 వార్డులు గెలవగా, ఇండిపెండెంట్ ఒక చోట గెలిచారు. అనూహ్యంగా ఇండిపెండెంట్ టీడీపీలో చేరారు. దీంతో కొండపల్లి టీడీపీ ఖాతాలో పడింది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గెలిచేస్తామనే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉండటంతో సీన్ రివర్స్ అయింది.

Discussion about this post