రాష్ట్రంలోని దళితుల విషయంలో వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ ఆలోచనా విధానమే సెపరేట్‌గా ఉంది. అనేక కీలక పదవులను, ఆఖరుకు రాజ్యాంగ బద్ధమైన పదవులను కూడా ఆయన దళి తులకు అప్పగిస్తున్నారని ఆ పార్టీ నేతలు బాగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారికి పదవులు మాత్రమే ఇస్తున్నా నిజంగా అధికార బదిలీ జరుగుతుందా ? దళితులు పదవుల్లో ఉన్నా కూడా సంతృప్తిగా ఉన్నారా ? అంటే దానికి ఆన్సర్ లేదు. పలు చోట్ల దళితులకు, దళిత ప్రజా ప్రతినిధులకు అవమానాలు జరుగుతున్నాయన్న వార్తలు మనం చూస్తూనే ఉంటున్నాం.

ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు వ్యవహరించిన తీరు.. దళితులకు తీవ్ర అన్యాయం.. అగౌరవం చేసిందనే వ్యాఖ్యలు వచ్చేలా చేసింది. జిల్లాలోని భీమడోలులో అభివృద్ది పనులకు ఇటీవల శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అయితే.. స్థానిక ఎంపీపీ విషయం లో నేతలు వ్యవహరించిన తీరు.. ఇబ్బందిగా మారింది. పార్టీపై విమర్శలు వచ్చేలా చేసింది. భీమడోలు ఎంపీపీ పదవి ఎస్సీ వర్గానికి రిజర్వు అయింది. దీంతో కొల్లేరు గ్రామం ఆగడాలలంక గ్రామం దళిత వర్గానికి చెందిన కనమాల రామయ్య(ఆదాం) ఇక్కడ పోటీ చేసి.. ఎం.పి.పిగా విజయం దక్కించుకున్నారు.

ఎవరు ఔనన్నా కాదన్నా… ప్రొటోకాల్ ప్రకారం.. ఇక్కడ ఏకార్యక్రమం నిర్వహించినా.. ఆదాంకు అగ్ర గౌరవం దక్కాల్సిందే. అయితే.. ఆయనను కొందరు అవమానించేలా వ్యవహరించారు. భీమడోలు గ్రామంలో 8 లక్షల నిధులతో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సత్రం నిర్మించడానికి నిర్ణయించారు. దీనికి సంబంధించి శిలాఫలకం వేశారు. స్థానిక శాసనసభ్యులు, ఎంపీతో పాటు స్థానిక జెడ్.పి.టి.సి స్థానిక ఎంపిటిసి సర్పంచ్ పేరు ఈ శిలాఫలకంపై వేశారు. కానీ, మండల పరిధిలో ప్రొటోకాల్ వర్తింప చేయాల్సిన ఎంపీపీ ఆదాం పేరును శిలా ఫలకంలో చేర్చలేదు. ఈ ఘటనపై స్థానిక దళితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దళితులను తీవ్రంగా అవమానించడమేనని.. వారు పేర్కొన్నారు.

పోనీ.. ఒకటో రెండో సంఘటనలు అయితే ఏదో పొరపాటున జరిగింది అనుకోవచ్చు. కానీ, వైసీపీ నేతలు చాలా చోట్ల ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారనే వాదన వినిపిస్తోంది. వైజాగ్ లో డా, సుధాకర్ మీద దాడి, తూర్పుగోదావరి జిల్లాలో శిరోముండనం కేసు, దళిత జడ్జీ రామకృష్ణ పై దాడి.. చిత్తూరు జిల్లాలో డాక్టర్ అనితా రాణి పై వేధింపుల పర్వం, ఓం ప్రతాప్ ఆత్మహత్య, గుంటూరులో దళిత యువతిపై బ్లేడు తో దాడి ఇలా అనేకం ఉన్నాయని.. దళితులు పేర్కొంటున్నారు. ఏదేమైనా దళితులకు ఈ ప్రభుత్వంలో ఇలాంటి అవమానాలు జరగడంతో దళిత సంఘాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి.

Discussion about this post