రాజకీయాల్లో పోరాటాలకు పెట్టింది పేరు పశ్చిమగోదావరి జిల్లా. ఈ జిల్లాలో గత నాలుగైదు దశాబ్దాలుగా ఎంతో మంది సీనియర్ నేతలు చక్రాలు తిప్పారు. ప్రతిపక్ష టీడీపీలో గతంలో కాకలు తీరిన మాజీ మంత్రులు కోటగిరి విద్యాధరరావు, కొత్తపల్లి సుబ్బారాయుడు, ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్, బోళ్ల బుల్లిరామయ్య, కృష్ణబాబు, మాగంటి బాబు లాంటి నేతల హవా ఒకప్పుడు ఉండేది. వీరిలో చాలా మంది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చక్రాలు తిప్పిన వాళ్లే. గత ఎన్నికల్లో పార్టీ చరిత్రలోనే లేనంత ఘోరంగా ఓడిపోయింది. ఇలాంటి టైంలో పార్టీ పగ్గాలు చేపట్టి పార్టీని ముందుకు నడిపించడం ఎవ్వరికి అయినా కత్తిమీద సాములాంటిదే.

ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఏలూరు పార్లమెంటరీ జిల్లా పగ్గాలు చేపట్టి జిల్లాలో ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ పార్టీని నిలబెడుతున్నారు ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు. కీలకమైన ఏలూరు పార్లమెంటరీ పార్టీ పగ్గాలు ఇచ్చే విషయంలో చంద్రబాబు ఎన్నో పేర్లు పరిశీలించినా సౌమ్యుడు, వివాదాలకు దూరంగా ఉండే గన్ని అయితేనే కరెక్ట్ అని భావించి ఆయనకు ఈ బాధ్యత అప్పగించారు.

బాబు వేసిన రాంగ్ స్టెప్ అదే..
2009 ఎన్నికలకు ముందు జిల్లాలో కీలక నేతలుగా ఉన్న మాజీ మంత్రులు పార్టీ మారిపోవడంతో పార్టీ అస్తవ్యస్థమైంది. ఆ తర్వాత జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టిన మాజీ మంత్రి తోట సీతారామ లక్ష్మి తన వంతుగా పార్టీని నడిపించారు. పదేళ్లు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా ఎవ్వరికి వారు పోరాటాలు చేయడంతో 2014 ఎన్నికల్లో పార్టీ జిల్లాలో అన్ని స్థానాలు గెలిచి స్వీప్ చేసేసింది. అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ముందు నుంచి పార్టీని నమ్ముకున్న వారిని కాదని జంపింగ్‌లకు పదవులు కట్టబెట్టడంతో పార్టీ నాశనం అయ్యింది. బీజేపీ కోటాలో పైడికొండల మాణిక్యాలరావు, జంపింగ్ జపాంగ్ అయిన పితాని సత్యనారాయణకు బాబు మంత్రి పదవులు ఇవ్వడం బిగ్ మిస్టేక్. జవహర్‌కు మంత్రి పదవి ఇచ్చినా.. ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

పార్టీ ఘోర ఓటమితో కష్టపడే వారికి ప్రాధాన్యం :
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన పొరపాట్లతో 2014 ఎన్నికల్లో జిల్లాలో స్వీప్ చేసిన పార్టీ గత ఎన్నికల్లో కేవలం రెండు సీట్లకే పరిమితం అయ్యింది. ఇక ఇప్పుడు పార్టీ కోసం కష్టపడే నాయకులను బాబు గుర్తిస్తోన్న పరిస్థితి. ఈ క్రమంలోనే పార్టీలో క్రమశిక్షణ ఉన్న గన్ని వీరాంజనేయులు అయితేనే ఇక్కడ సీనియర్లు, జూనియర్లతో పాటు దూకుడు నాయకులను కలుపుకుని ముందుకు వెళతారని భావించి ఆయనకే ఏలూరు పార్లమెంటరీ జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారు. జిల్లాలో మూడు పార్లమెంటరీ జిల్లాలో ఉన్న సామాజిక సమీకరణలు భేరీజు వేసుకుని నరసాపురానికి కాపు వర్గానికి చెందిన తోట సీతారామలక్ష్మి, కొవ్వూరుకు ఎస్సీ వర్గానికి చెందిన కేఎస్. జవహర్, ఏలూరు పార్లమెంటరీ పరిధిలో కల సమీకరణల నేపథ్యంలో గన్ని వీరాంజనేయులుకు ఈ పదవి ఇచ్చారు.

గన్ని గిరా గిరా..
గన్నికి పార్టీ పగ్గాలు ఇచ్చిన వెంటనే ఆయన పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాల్లోనూ గిరా గిరా తిరుగుతూనే ఉన్నారు. తన పరిధిలో మాత్రమే కాకుండా జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా అధిష్టానం సూచనల మేరకు వెంటనే అక్కడ వాలిపోయి ముందు వారు చెప్పేది సావధానంగా వింటున్నారు. ఆ తర్వాత తనదైన స్టైల్లో ఆ సమస్యను చిటికెలో పరిష్కరించి పలు సార్లు చంద్రబాబు ప్రశంసలు అందుకుంటున్నారు. ఏలూరు పార్లమెంటరీ పరిధిలోనే కృష్ణా జిల్లాలో నూజివీడు, కైకలూరు కూడా ఉన్నాయి. ఆ జిల్లాలో ఉన్న రెండు నియోజకవర్గాల్లో పార్టీ ఇబ్బందుల్లో ఉంది. అక్కడ నేతలను సమన్వయం చేయడం… చింతమనేని లాంటి దూకుడు నేతను సమన్వయం చేసుకోవడం కూడా గన్నికి బిగ్ ఛాలెంజ్ అయినా ఆయన ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. చింతమనేని దూకుడుకు పెట్టింది పేరు అయినా గన్ని చెప్పాల్సినట్టు చెపితే ఆయన ఎంచక్కా వింటారన్న టాక్ ఉంది.

పలు నియోజకవర్గాల్లో కొత్త నాయకత్వంతో పార్టీకి జవసత్వాలు :
గన్ని పార్టీ పగ్గాలు చేపట్టిన వెంటనే ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో చిన్న చితకా సమస్యలు ఉన్నా కొత్త నాయకత్వాన్ని, యువనాయకత్వాన్ని ఎంకరేజ్ చేశారు. ముఖ్యంగా ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో కొట్టుమిట్టాడే రిజర్వ్‌డ్ సెగ్మెంట్లు చింతలపూడి, పోలవరంలో ఉన్న సమస్యలను చాలా వరకు ఒంటి చేత్తోనే పరిష్కరించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కొందరు నాయకులు గన్నినే బెదిరించాలని చూశారు. గన్నికి కుల ముద్ర వేయాలని చూశారు. అయితే ఆయన కొరడా ఝులిపించి పార్టీ నుంచి సస్పెండ్ చేసే దిశగా అడుగులు వేయడంతో ఇప్పుడు వారంతా సైలెంట్ అయిపోయి పార్టీ కోసం పని చేస్తున్నారు. ఏదైనా మంచి కి మంచ్.. పంచ్‌కు పంచ్ అనేదే గన్ని స్టైల్. పార్టీకి నష్టం కలిగించే చర్యలు ఎలాంటి నాయకుడు చేసినా కూడా ఆయన ఏ మాత్రం సహించడం లేదు.

పశ్చిమ టీడీపీకి ట్రబుల్ షూటర్ :
గన్నికి చంద్రబాబు ముందుగా ఏలూరు పార్లమెంటరీ పార్టీ పగ్గాలు అప్పగించినా ఆయన సామర్థ్యాన్ని గుర్తించి జిల్లాలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా సెట్ చేసే బాధ్యత ఆయనకే అప్పగిస్తున్నారు. 20 ఏళ్లకు పైగా టీడీపీ గెలవని తాడేపల్లిగూడెంలో బలమైన ఇన్‌చార్జ్‌ను సెట్ చేయడంలో గన్ని కీ రోల్ పోషించారు. అలాగే జిల్లా కేంద్రమైన ఏలూరు లో మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి హఠాన్మరణం తర్వాత ఆయన సోదరుడు బడేటి చంటికి పార్టీ పగ్గాలు వచ్చేలా చేయడం చేసి.. అక్కడ ఆయన దూసుకుపోయేలా చేశారు. చాలా తక్కువ టైంలోనే చంటి ఏలూరులో మంత్రి ఆళ్ల నానికి ధీటైన ప్రత్యర్థిగా మారారు.

ఆకివీడులో గన్ని ఎత్తుతో వైసీపీకి ముచ్చెమటలు:
ఇప్పుడు జిల్లాలో ఆకివీడు నగర పంచాయతీకి ఎన్నికలు జరుగుతున్నాయి. గన్ని ఎలాగైనా వైసీపీని ఓడించాలని తనదైన స్టైల్లో వ్యూహం పన్నారు. ముందుగానే జనసేనతో పొత్తు పెట్టుకుని ఓట్లు చీలిపోకుండా వైసీపీకి షాక్ ఇచ్చారు. అక్కడ గెలుపు ఓటములు ఎలా ఉన్నా వైసీపీకి మాత్రం అప్పుడే టెన్షన్ పట్టుకుంది. ఏదేమైనా జిల్లాలో ఏ సమస్య ఉన్నా ప్రతిది అధిష్టానం వద్దకు వెళ్లకుండా తనదైన స్టైల్లో పరిష్కరిస్తూ చంద్రబాబు వద్ద మంచి మార్కులు వేయించుకుంటున్నాడు గన్ని.

Discussion about this post