పర్చూరు-చీరాల ఈ రెండు స్థానాల్లో గెలుపు కోసం వైసీపీ ఇప్పుడు నానా ఎత్తులు వేస్తుంది. ఎలాగైనా నెక్స్ట్ ఎన్నికల్లో గెలవాలని పాట్లు పడుతుంది. గత ఎన్నికల్లో ఈ రెండు స్థానాల్లో టిడిపి గెలిచిన విషయం తెలిసిందే. పర్చూరులో ఏలూరి సాంబశివరావు, చీరాలలో కరణం బలరామ్ గెలిచారు. అయితే ఆ తర్వాత కరణంని వైసీపీలోకి లాక్కున్నారు. దీంతో చీరాలపై పట్టు బిగించవచ్చు అనేది వైసీపీ ప్లాన్.

కానీ ఆ పరిస్తితి కనిపించలేదు..అక్కడ ఆధిపత్య పోరు మొదలైంది. వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమంచి కృష్ణమోహన్, కరణంల మధ్య రచ్చ మొదలైంది. ఈ రచ్చకు బ్రేక్ పెట్టాలని చెప్పి…ఆమంచిని పక్కనే ఉన్న పర్చూరుకు ఇంచార్జ్ గా పంపారు. ఇలా పంపడం వల్ల రెండు చోట్ల వైసీపీకి ఎదురుదెబ్బలు తగిలేలా ఉన్నాయి. ఎందుకంటే మొన్నటివరకు పర్చూరులో కష్టపడ్డ రావి రామనాథం బాబుని తప్పించి ఆమంచిని పెట్టారు.
దీని వల్ల రావికి సపోర్ట్ గా ఉన్న కమ్మ ఓట్లు వైసీపీకి పడటం కష్టం.రావి వర్గం ఆమంచికి సపోర్ట్ చేయదు. అలా అని ఆమంచి సొంత వర్గం కాపు ఓట్లు జనసేన వైపుకు వెళ్తాయి. టిడిపి, జనసేన పొత్తు ఉంటే ఇంకా వైసీపీ పరిస్తితి దారుణం. ఆమంచి పర్చూరుకు వచ్చిన ఆయన వర్గం చీరాలలో ఉంది..అక్కడ కరణంకు ఆమంచి వర్గం సహకరించదు. ఇటు ఆమంచి సోదరుడు స్వాములు జనసేన వైపుకు వచ్చారు. దీంతో కాపు ఓట్లు కలిసి రావు. ఇక పొత్తు ఉంటే టిడిపికి లేదా జనసేనకు ఈ సీటు దక్కే అవకాశం ఉంది. ఎవరికి దక్కినా ఇక్కడ వైసీపీకి చెక్ పడుతుంది. అంటే అటు పర్చూరు, ఇటు చీరాలలో వైసీపీకి ఎదురుదెబ్బలు తప్పవని చెప్పవచ్చు.
