వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేన పొత్తు దిశగా వెళుతున్న విషయం తెలిసిందే. పొత్తు పెట్టుకుని వైసీపీకి చెక్ పెట్టాలని ఛుస్తున్నారు. ఇటు చంద్రబాబు, అటు పవన్ సైతం పొత్తుకు రెడీగానే ఉన్నారు. అయితే పొత్తు ఉంటే తమకు నష్టమనే సంగతి వైసీపీకి బాగా తెలుసు. అందుకే ఆ రెండు పార్టీల మధ్య పొత్తు లేకుండా చేయడమే లక్ష్యంగా వైసీపీ నేతలు చిచ్చు పెట్టడానికి ఛుస్తున్నారు. దమ్ముంటే 175 సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలని రెచ్చగొడుతున్నారు..సీట్ల విషయంలో రచ్చ లేపుతున్నారు.
అయితే వైసీపీ ఎన్ని రకాలుగా ట్రై చేసిన టిడిపి, జనసేనల మధ్య దూరం పెరగడం లేదు. ఇదే సమయంలో వైసీపీ వేరే విధంగా రాజకీయం చేస్తుందనే ప్రచారం వస్తుంది. ఇలాంటి సమయంలోనే పవన్ వెనుక ఉంటూ..కాపులంతా పవన్ కు అండగా ఉండాలని కోరుతున్న కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరి రామ జోగయ్య కామెంట్స్ ఇప్పుడు..టిడిపి, జనసేనల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయి.

మొన్న ఆ మధ్య జనసేనతో పొత్తు లేకపోతే టిడిపి పని అయిపోతుందని, పవన్ కు సిఎం సీటు ఇచ్చి చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోవాలని జోగయ్య మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ కొత్త పంథాలో వచ్చారు. ఏపీలో వైసీపీని గద్దె దించాలంటే చంద్రబాబు బెట్టు వీడి మెట్టు దిగి రావాలని, ఐదేళ్ల కాలాన్ని చెరి సగం కాలంగా పవన్, చంద్రబాబు పంచుకుంటే మంచిదని, అది కాకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయడమే బెటర్ అని, ఒంటరిగా పోటీ చేయడానికి పవన్ భయపడాల్సిన అవసరం లేదని, జనసేన గ్రాఫ్ అమాంతం ఏపీలో పెరిగిందని, బీజేపీతో కలసి బరిలోకి దిగితే మోదీ చరిష్మా కూడా కలసి పవన్ ఏపీకి కొత్త సీఎం కావడం ఖాయమని అన్నారు.
అయితే ఏపీలో జనసేన బలం ఎంత కాదు అనుకున్న 10 శాతం ఓట్లు..10 సీట్లు ఇప్పుడున్న పరిస్తితుల్లో..ఒంటరిగా పోటీ చేస్తే అదే జరుగుతుంది. ఆ విషయం సర్వేలు చెబుతున్నాయి. అలాగే టిడిపి సిఎం సీటు వదులుకోదు..అవసరమైతే ఒంటరిగానే బరిలోకి వెళుతుంది. ఆ విషయం పవన్‌కు తెలుసు. కానీ జోగయ్య ఇలా రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం వల్ల టిడిపి, జనసేన మధ్య చిచ్చు రగిలేలా ఉంది. అసలు జోగయ్యకు కూడా కావాల్సింది అదే అని, జగన్ కు లబ్ది చేకూర్చడానికే పొత్తు చెడగొట్టేందుకు చూస్తున్నారని టిడిపి శ్రేణులు అనుమానిస్తున్నాయి.
