ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని కాన్ఫిడెన్స్ పెట్టుకునే సీట్లలో పెడన కూడా ఉంటుందని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో జిల్లాలో 16 సీట్లు ఉంటే కేవలం 2 సీట్లు మాత్రమే టీడీపీ గెలుచుకున్న విషయం తెలిసిందే. విజయవాడ తూర్పు, గన్నవరం సీట్లలోనే గెలిచారు. ఆ తర్వాత గన్నవరం ఎమ్మెల్యే వంశీ వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. దీంతో జిల్లాపై వైసీపీకి పట్టు దక్కినట్లు అయింది. కానీ నిదానంగా జిల్లాలో టీడీపీ బలం పెరుగుతూ వచ్చింది. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం, టీడీపీ నేతలు కష్టపడి పనిచేస్తుండటంతో కొన్ని స్థానాల్లో టీడీపీ పుంజుకుంది.

అలా పెడన లో కూడా టీడీపీ పికప్ అయింది. గత ఎన్నికల్లో ఇక్కడ కాగిత వెంకట్రావు తనయుడు కృష్ణప్రసాద్ పోటీ చేసి జోగి రమేశ్ చేతిలో ఓడిపోయారు. మెయిన్ గా జనసేన ఓట్లు చీలిక టీడీపీకి పెద్ద మైనస్ అయింది. అయితే ఓడిపోయాక కాగిత నిదానంగా నియోజకవర్గంలో పనిచేస్తూ వచ్చారు. ప్రజల్లో తిరగడం మొదలుపెట్టారు. తన తండ్రికి మద్ధతుగా నిలబడ్డవారిని మళ్ళీ దగ్గర చేసుకున్నారు. ప్రధానంగా పెడనలో యువతని తన వైపుకు తిప్పుకున్నారు.

గతంలో ఇక్కడ యువత టీడీపీకి పెద్ద పాజిటివ్ గా లేరు. కానీ కాగిత గ్రామ స్థాయిలో ఉన్న యువతపై పట్టు సాధించారు. తనకు మద్ధతు పెరిగేలా చూసుకున్నారు. ఇక అధికార బలంతో ఉన్న జోగి రమేశ్..ప్రజలకు అందనంత దూరంలో ఉండిపోయారు. పైగా పెడనలో కొందరు వైసీపీ నేతలు చేసే అక్రమాలు ఆ పార్టీకి పెద్ద మైనస్ గా మారాయి. పైగా వైసీపీలో వర్గ పోరు ఉంది. ఈ పరిస్తితులు పెడనలో టీడీపీని లీడ్ లోకి తీసుకొచ్చాయి.

అయితే నెక్స్ట్ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటే డౌట్ లేకుండా ఈ సీటు టీడీపీ గెలుస్తుంది. పొత్తు లేకపోయినా..కాగితపై సానుభూతి, వైసీపీపై వ్యతిరేకత గెలిపించే అవకాశాలు ఉన్నాయి.
