చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో రాజకీయంగా టీడీపీ అనేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు జిల్లాలో పార్టీకి మంచి పట్టు ఉండేది. కానీ వైసీపీ వచ్చాక టీడీపీ హవా తగ్గింది. జిల్లాలో పూర్తిగా వైసీపీ హవా పెరిగింది. గత ఎన్నికల నుంచి అయితే వైసీపీ డామినేషన్ స్పష్టంగా కొనసాగుతుంది. ఆఖరికి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా పాగా వేయడానికి వైసీపీ ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో తెలిసిందే.

ఇప్పుడు చిత్తూరు మొత్తం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ్రిప్‌లోకి వెళ్లిపోయింది. ఆయనే రాజకీయంగా టీడీపీని దెబ్బతీస్తున్నారు..అధికార బలాన్ని ఉపయోగించుకుని జిల్లాలో టీడీపీని లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ ప్రయత్నాలని తిప్పికొట్టేందుకు చంద్రబాబు కూడా సిద్ధమయ్యారు. ఎలాగైనా రాజకీయంగా పెద్దిరెడ్డికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. తన సొంత జిల్లాలోనే టీడీపీ ఉనికి ప్రమాదంలో పెట్టడం..ఆఖరికి తన సొంత నియోజకవర్గం కుప్పంని కూడా వదలకపోవడంతో చంద్రబాబు రంగంలోకి దిగేసి..పెద్దిరెడ్డిని టార్గెట్ చేశారు.

అసలు ఆయన్ని తన సొంత నియోజకవర్గం పుంగనూరులోనే కట్టడి చేయడానికి చూస్తున్నారు. ఇక చంద్రబాబు గైడెన్స్ ఇవ్వడం…ఆ గైడెన్స్‌లో తమ్ముళ్ళు దూకుడుగా పనిచేయడం జరుగుతుంది. మొన్నటివరకు అంటే పెద్దిరెడ్డి ఎక్కడ ఇబ్బంది పెడతారని చెప్పి, తమ్ముళ్ళు దూకుడుగా పనిచేయలేదు. కానీ ఇప్పుడు తమ్ముళ్ళు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పుంగనూరులో పెద్దిరెడ్డిని దెబ్బకొట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు.

ఇప్పటికే టీడీపీ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి దూకుడుగా ఉన్నారు..నియోజకవర్గంలో సమస్యలపై గళం విప్పుతున్నారు..కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. ఎక్కడ అవకాశం దొరికినా సరే పెద్దిరెడ్డిని టార్గెట్ చేసి రాజకీయంగా విమర్శిస్తున్నారు. ఆయనకు ఎలాగైనా చెక్ పెట్టాలనే టార్గెట్‌తో చల్లా పనిచేస్తున్నారు. మునుపటితో పోలిస్తే పుంగనూరులో టీడీపీ కార్యకర్తలు కూడా ఫుల్ యాక్టివ్ అయ్యారు. ఈ సారి ఎలాగైనా పెద్దిరెడ్డి ఓడించి రివెంజ్ తీర్చుకోవాలన్నట్లు పనిచేస్తున్నారు. మొత్తానికైతే పుంగనూరులో తెలుగు తమ్ముళ్ళు ఏ మాత్రం తగ్గడం లేదు…మరి చివరికి పెద్దిరెడ్డికి చెక్ పెట్టగలరో లేదో చూడాలి.
Discussion about this post