ఔను! రాష్ట్ర వ్యాప్తంగా మేధావులు ఇదే ప్రశ్న అడుగుతున్నారు. రాష్ట్రంలో గత చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్ వినియోగించిందని.. కొందరి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని.. వైసీపీ నాయకులు.. మంత్రులు ఇటీవల అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. దీనికి మూలం.. పశ్చిమ బెంగాల్ సీఎం.. మమతాబెనర్జీ అక్కడి అసెంబ్లీలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. పెగాసస్ ను రూ.25 కోట్లకు కొనుగోలు చేశారని చెప్పడమే. అయితే.. దీనిపై టీడీపీ ఇప్పటికే వివరణ ఇచ్చింది. తాము అధికారంలో ఉన్నపుడు.. ఆఫర్ వచ్చిన మాట వాస్తవమేనని.. అయితే.. ప్రజల గోప్యత హక్కును హరిస్తుందనే ఉద్దేశంతో తాము దీనిని కోనుగోలు చేయలేదని.. పార్టీ తరఫున మాజీ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.

ఇక, చంద్రబాబు దీనిపై బహిరంగ వ్యాఖ్యలు చేయనప్పటికీ.. పార్టీ కార్యకర్తల సమావేశంలో మాత్రం దీనిని కొనలేదని చెప్పారు. అయితే.. అసెంబ్లీలో దీనిపై పెద్ద ఎత్తున చర్చించారు. ఈక్రమంలోనే తాజాగా టీడీపీ పెగాసెస్ వ్యవహారంపై శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారం హౌస్ హౌస్ కమిటీ వేశారు. ఈ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి(తిరుపతి)ని నియమించా రు. అదే విధంగా కమిటీ సభ్యులుగా ఎమ్మెల్యేలు కొట్టిగుళ్ల భాగ్యలక్ష్మి(పాడేరు), అబ్బయ్య చౌదరి(దెందులూరు), కొలుసు పార్థసారధి(పెనమలూరు), అమర్నాథ్(అనకాపల్లి), మేరుగు నాగార్జున(వేమూరు), మద్దాల గిరిధర్(గుంటూరు వెస్ట్)ను నియమించారు.

రేపో మాపో.. ఈ కమిటీ తన పని ప్రారంభిస్తున్నది. అయితే.. ఇక్కడ అనేక ధర్మ సందేహాలు తెరమీదికి వస్తున్నాయి. ఒకటి.. అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. పెగాసస్‌ను టీడీపీ ప్రబుత్వం కొనలేదని స్వయంగా చెప్పారు. పైగా.. చంద్రబాబు అండ్‌కోలు.. ప్రైవేటుగా కొనుగోలు చేసి ఉన్నా.. ఆధారాలు లేకుండా కొనుగోలు చేసిందని చెప్పారు. మరి .. ఆధారాలు లేవని.. మంత్రిగారే చెప్పినప్పుడు.. ఈ కమిటీ ఏం చేస్తుంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. రెండు.. చంద్రబాబు కొనుగోలు చేశారని.. చెప్పిన మమతా బెనర్జీ కూడా దీనికి ఆధారాలను చెప్పలేదు. సో.. ఇది కూడా ఫలించే మంత్రం కాదు.

ఇక, ఇప్పటికే దీనిపై విచారణ ప్రారంభించిన సుప్రీం కోర్టు కమిటీకి ఎక్కడా ఏపీలో ఆనవాళ్లు ఉన్నాయని కానీ.. పెగాసస్‌ను ఇక్కడ వినియోగించారని కానీ.. ఎవరూ ఏ సంస్థ కూడా ఫిర్యాదు చేయలేదు. పైగా పెగాసస్ నిబంధనల మేరకు.. ఈ సాఫ్ట్‌వేర్‌ను ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు విక్రయించే అవకాశం లేదు. సో.. ఇన్ని అంశాల మధ్య ఈ కమిటీ ఏం తేలుస్తుంది? ఏం చేస్తుంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఏదేమైనా.. కమిటీ రూపంలో ప్రజాధనం వృధా కావడం తప్ప.. తేలేది.. తేల్చేది ఏమీ ఉండదని చెబుతున్నారు మేధావులు. అంతేకాదు.. ఈ కమిటీ ఇచ్చే నివేదిక కారణంగా.. టీడీపీకే మేలు జరుగుతుందని.. అంటున్నారు.

Discussion about this post