గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో చాలామంది ఎమ్మెల్యేలు గెలిచి గట్టెక్కారు..అలా గెలిచిన వారిలో అదీప్ రాజ్ కూడా ఒకరు. పెందుర్తి నుంచి అదీప్ గెలిచారు. టిడిపి సీనియర్ నేత బండారు సత్యనారాయణని ఓడించి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అలా తొలిసారి ఎమ్మెల్యే అయిన అదీప్..అనుకున్న మేర ప్రజా బలం పెంచుకోవడంలో విఫలమయ్యారు. పైగా వీరి బంధువులు పెద్ద ఎత్తున నియోజకవర్గంలో అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు ఎమ్మెల్యేకు మైనస్ అయ్యాయి.

అదే సమయంలో నియోజకవర్గంలోకి పంచకర్ల రమేశ్ బాబు ఎంట్రీ ఇచ్చారు. టిడిపి నుంచి వైసీపీలోకి వచ్చిన పంచకర్లని అనకాపల్లి జిల్లా అధ్యక్షుడుగా పెట్టారు. అయితే ఈయన పెందుర్తిపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ సీటులోనే పోటీ చేయాలని పంచకర్ల చూస్తున్నారు. అయితే మళ్ళీ ఆ సీటు దక్కించుకోవాలని అదీప్ ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. అదే సమయంలో తాజాగా విశాఖపట్నం రూరల్ జిల్లా మాజీ అధ్యక్షుడు శరగడం చినఅప్పలనాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేయించడం సంచలనంగా మారింది.

అయితే పెందుర్తికి చెందిన చిన అప్పలనాయుడుకు స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌తో విభేదాలు ఉన్నాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో తన ఓటమికి ఎమ్మెల్యేనే కారణమని శరగడం భావించి…అదీప్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. నియోజవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శరగడం చినఅప్పలనాయుడును ఆహ్వానించడం లేదని ఇటీవల ఆయన అనుచరులు ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ను అడ్డుకున్నారు. అలాగే శరగడం వర్గం సెపరేట్ గా కార్యక్రమాలు చేస్తుంది.

దీంతో ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే వర్గం ఫిర్యాదు చేయడంతో..శరగడంని వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో శరగడం ఇంకా దూకుడుగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి పెందుర్తిలో అదీప్‌కు కష్టాలు ఎక్కువగా ఉన్నాయి.
