మళ్ళీ చాలా రోజుల తర్వాత పోలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జోరు పెరిగింది. ఏజెన్సీ ప్రాంతంగా ఉండే ఈ స్థానంలో మొదట నుంచి టిడిపికి పెద్ద పట్టు ఉండేది కాదు. టిడిపి హవా ఉన్న 1985, 1994, 1999 ఎన్నికల్లోనే ఇక్కడ టిడిపి గెలిచింది. మళ్ళీ 2014లో గెలిచింది. అంటే నాలుగుసార్లు టిడిపి గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పలుమార్లు సత్తా చాటింది.
కానీ గత ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. వైసీపీ నుంచి బాలరాజు విజయం సాధించారు. 2004 నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. 2004, 2009ల కాంగ్రెస్ నుంచి 2012 ఉపఎన్నికలో వైసీపీ నుంచి గెలిచారు. 2014లో ఓడిపోయిన ఈయన..2019 ఎన్నికల్లో మళ్ళీ గెలిచారు. నాలుగుసార్లు గెలవడంతో మంత్రి పదవి ఆశించారు..కానీ మంత్రి పదవి రాలేదు. ఇక ఎమ్మెల్యేగా పనిచేసుకుంటూ వెళుతున్నారు. కానీ నియోజకవర్గానికి నిధులు రాకపోవడంతో అభివృద్ధి లేదు. ఏపీ ప్రజల జీవనాడి అయిన పోలవరం ఇక్కడే ఉంది.

ఇక పోలవరం వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదు..పోలవరం ఎత్తు తగ్గించింది..పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయడం లేదు. నిర్వాసితులకు పూర్తి స్ధాయిలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకపోవడం, నిర్వాసితులను బలవంతంగా వారి గ్రామాల నుంచి ఖాళీ చేయించడం, గోదావరి వరదల సమయంలో బాధితులను పట్టించుకోకపోవడం లాంటి అంశాలు వైసీపీకి బాగా మైనస్ అయ్యాయి.
ఇదే సమయంలో టిడిపి నేత బొరగం శ్రీనివాస్ దూకుడుగా పనిచేస్తున్నారు. గోదావరికి వరదలు వచ్చినప్పుడు అధికార పార్టీ నేతలు బాధిత ప్రాంతాలకు వెళ్లక ముందే కార్యకర్తలతో కలిసి బొరగం ప్రజల దగ్గరకు వెళ్లారు. టీడీపీ నిర్వహించిన బాదుడే బాదుడు, ఇతర పార్టీ కార్యక్రమాలకు సైతం పార్టీకి మంచి పేరు వచ్చింది. ఈ పరిణామాల నేపధ్యంలో పార్టీకి పోలవరం నియోజకవర్గంలో పూర్వ వైభవం వచ్చిందని చెప్పవచ్చు. వచ్చే ఎన్నికల్లో పోలవరంలో పసుపు జెండా ఎగిరేలా ఉంది.
