వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే..దాదాపు రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయమని తెలుస్తోంది. చంద్రబాబు-పవన్ సైతం పొత్తుకు సిద్ధంగానే ఉన్నారని అర్ధమవుతుంది. ఇప్పటికే పవన్ పలుమార్లు వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని చెప్పిన విషయం తెలిసిందే. అటు ఈ మధ్య టీడీపీలో మాజీ మంత్రి ఆలపాటి రాజా సైతం..తనకు తెనాలి సీటుపై ఆశ లేదని చెప్పారు. అంటే ఇక్కడ జనసేన తరుపున నాదెండ్ల మనోహర్ పోటీ చేయనున్న నేపథ్యంలోనే ఆలపాటి పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

దీని బట్టి చూస్తే టీడీపీ-జనసేనల మధ్య పొత్తు దాదాపు ఖాయమనే తెలుస్తోంది. ఇక పొత్తులో భాగంగా ఎవరికి ఎన్ని సీట్లు అనే లెక్కలు తర్వాత తేలుతాయి. కానీ ఈలోపే సీట్ల లెక్కల గురించి కథనాలు వస్తున్నాయి. జనసేన ఏమో 40 సీట్ల వరకు అడుగుతుందని, కానీ టీడీపీ మాత్రం 25-30 సీట్లు వరకు ఇవ్వడానికి రెడీగా ఉందని అంటున్నారు.

ఇదే క్రమంలో విజయవాడ నగరంలో జనసేన రెండు సీట్లు అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. విజయవాడ ఈస్ట్, వెస్ట్ సీట్లు అడుగుతున్నారని కథనాలు వస్తున్నాయి. 2009లో ప్రజారాజ్యం ఈ రెండు సీట్లని గెలుచుకుంది. రెండు సీట్లలో జనసేనకు బలం ఉంది. అందుకే ఆ రెండు సీట్లు అడుగుతున్నారని తెలిసింది.

అయితే ఇందులో ఈస్ట్ సీటు టీడీపీ సిట్టింగ్ సీటు. అక్కడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్..ఆయనని కాదని జనసేనకు సీటు దక్కడం జరిగే పని కాదు. కానీ వెస్ట్ సీటు ఇవ్వడానికి టీడీపీ రెడీగా ఉంది. పైగా అక్కడ టీడీపీకి నాయకులు లేరు. ఎంపీ కేశినేని నానిని తాత్కాలికంగా ఇంచార్జ్ గా పెట్టారు. కాబట్టి ఈ సీటు జనసేనకు ఇచ్చే ఛాన్స్ ఉంది..కానీ ఈస్ట్ సీటు కష్టమే.
