వైసిపికంచుకోట అయిన ప్రకాశం జిల్లాలో వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఆ పార్టీలోని గ్రూపు తగాదాలు ఓడించేలా ఉన్నాయి. పలు నియోజకవర్గాల్లో పార్టీ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయారు. గత కొంతకాలంగా పార్టీ లో నడుస్తున్న ఈ గ్రూపు తగాదాలు తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మరింత బహిర్గతం అయ్యాయి. చాలాచోట్ల నియోజకవర్గ స్థాయిలో ఉన్న గ్రూపు తగాదాలు నేపథ్యంలో సర్పంచులు, మండల పరిషత్ సభ్యులు అసలు జగన్ పుట్టిన రోజును పట్టించుకోలేదు. జిల్లాలోని చీరాల – కనిగిరి – దర్శి – కందుకూరు – కొండపి నియోజకవర్గాల్లో పార్టీ గ్రూపులుగా విడిపోయి ఉంది.

చీరాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కరణం బలరాం వర్సెస్ మాజీ ఎమ్మెల్యే చీరాల నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ మధ్య గత ఏడాదిన్నర కాలంగా ఆధిపత్య రాజకీయాలు నడుస్తున్నాయి. తాజాగా జగన్ పుట్టినరోజు వేడుకల్లో ఈ రెండు వర్గాలతో పాటు ఎమ్మెల్సీ పోతుల సునీత వర్గం కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ఇక దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆయన అనుచరులు ఒక వర్గంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి – జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మరో వర్గంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వేణుగోపాల్ లేకపోయినా ఆయన అనుచరులు మాత్రం ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించారు. కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ అనుచరులు ఒక వర్గం గానూ , రెడ్డి సామాజిక వర్గం నేతలు మరో వర్గం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రిజర్వుడు నియోజకవర్గం కొండపిలో నియోజకవర్గ ఇన్చార్జ్ మదాసి వెంకయ్య, మాజీ ఇన్చార్జి అశోక్ బాబు వర్గాలు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించాయి.

ఇక అద్దంకి లోనూ కరణం బలరాం వర్గం , నియోజకవర్గ ఇన్చార్జి కృష్ణ చైతన్య వర్గం వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇక కందుకూరులో ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి… ఇటీవల ఎమ్మెల్సీగా గెలిచిన మాధవరావు మద్దతుదారులు కూడా వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పర్చూరు నియోజకవర్గం లోనూ ఇన్చార్జి రావి రామనాథం బాబు ఒక వర్గం గానూ… ఏఎంసీ చైర్మన్ మరో వర్గంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికలకు మరో రెండు సంవత్సరాలు ఉండగానే పార్టీలో గ్రూపుల గోల ఎక్కువగా ఉండడంతో.. ఇవే ఆ పార్టీ కొంప కొల్లేరు చేసేలా ఉన్నాయి.

Discussion about this post