ఒకసారి 2014 ఎన్నికల సమయంలో రిజల్ట్ రోజున గుర్తు చేసుకుంటే…అప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన ట్రెండ్ నడుస్తోంది. మెజారిటీ సీట్లలో టిడిపి లీడింగ్‌లోకి వచ్చింది. ఇక టిడిపి గెలిచినట్లు మొదట ఒక ఫలితం వచ్చింది. ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్ధన్ గెలిచినట్లు రిజల్ట్ డిక్లేర్ అయింది. 2014 ఎన్నికల్లో టిడిపి గెలిచిన తొలి సీటు అదే. ఇక అక్కడ నుంచి టిడిపి లీడ్ మరింత పెరిగి…అధికారం దక్కించుకునే వరకు వెళ్లింది.

అయితే 2014లో టిడిపి గెలిచిన సీటు 2019 ఎన్నికల్లో కోల్పోవాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా స్పష్టంగా కొనసాగడంతో ఒంగోలులో దామచర్ల జనార్ధన్ ఓటమి పాలయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మరొకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక అంతకముందు బాలినేని నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే ఒంగోలుపై బాలినేనికి ఎంత పట్టు ఉందో చెప్పాల్సిన పని లేదు.

2019 ఎన్నికల్లో ఐదోసారి గెలిచి మంత్రి కూడా అయ్యారు. మరీ ఇలా అయిదుసార్లు గెలిచిన బాలినేని…ఒంగోలుకు చేసిన అభివృద్ధి ఏంటి అంటే…అయిదుసార్లు ఎమ్మెల్యేగా అభివృద్ధి బాగానే చేశారు. కానీ ఒక్కసారి గెలిచిన దామచర్ల అంతకంటే గొప్పగానే అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఇప్పుడు ఒంగోలు ప్రజలు మాట్లాడుకునే పరిస్తితి వచ్చింది. దామచర్ల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే వేసిన రోడ్లు తప్ప, ఇప్పుడు కొత్తగా వేసిన రోడ్లు కనబడటం లేదు.

దామచర్ల సమయంలో తాగునీటి సమస్య, డ్రైనేజ్ సమస్యలకు చెక్ పెట్టడానికి చూశారు. కానీ ఇప్పుడు అవి మళ్ళీ మామూలు అయిపోయాయి. ఇవే కాదు….అప్పటికి, ఇప్పటికీ ఒంగోలులో చాలా తేడా ఉందని అంటున్నారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు తప్ప కొత్తగా ఒరిగింది ఏమి లేదు. అటు బాలినేని ప్రజలకు అందుబాటులో ఉండటం కూడా తక్కువే అంటున్నారు…ఇక వైసీపీ నేతల అక్రమాల గురించి చెప్పాల్సిన పని లేదని చెబుతున్నారు. ఈ పరిస్తితుల నేపథ్యంలో ఒంగోలు ప్రజలు మళ్ళీ దామచర్ల వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. మరి 2024 ఎన్నికల్లో టిడిపి గెలిచే తొలిసీటు మళ్ళీ ఒంగోలు అన్న టాక్ స్థానికంగా వినిపిస్తోంది.

Discussion about this post