ఏపీలో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు తారస్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతలకే పడటం లేదు. ముఖ్యంగా ఎమ్మెల్యేలపై సొంత పార్టీ వాళ్లే వ్యతిరేకతతో ఉంటున్నారు. గత ఎన్నికల్లో వారి గెలుపు కోసం పనిచేస్తే..ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తమని పట్టించుకోవడం లేదనే అసంతృప్తి వైసీపీ నేతల్లో ఎక్కువ ఉంది.
సరిగ్గా ఇదే పరిస్తితి తిరువూరు వైసీపీలో ఉంది. గత రెండు ఎన్నికల్లో వైసీపీ నుంచి రక్షణనిధి గెలుస్తూ వస్తున్నారు. అయితే గతంలో ఆయన గెలుపు కోసం పనిచేసిన నేతలని ఇప్పుడు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కొందరు నేతలు గ్రూపులు కడుతున్నారు. దీంతో పరిస్తితి మారిపోయింది. ఇక తాజాగా తిరువూరు మున్సిపాలిటీ చైర్ పర్సన్ విషయం సంచలనంగా మారింది.

మున్సిపల్ ఎన్నికల్లో తిరువూరు మున్సిపాలిటీని వైసీపీ గెలుచుకుంది. 20 వార్డులకు గానూ వైసీపీ 17, టీడీపీ 3 వార్డులు దక్కించుకున్నాయి. వైసీపీ మెజారిటీ సాధించడంతో చైర్‌పర్సన్‌గా గత్తం కస్తూరి పేరును అధిష్టానం ఖరారు చేసింది. అయితే ఎమ్మెల్యే రెండేళ్లపాటే కస్తూరి ఆ పదవిలో ఉంటారని, ఆ తర్వాత మరొకరు బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పారు. ఎమ్మెల్యే సూచించిన గడువు ఈ ఏడాది మార్చితో ముగియడంతో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులు ఆశిస్తున్న వారు తెరపైకి వచ్చారు. కానీ, ప్రస్తుత చైర్‌పర్సన్ వర్గం మార్పుకు అంగీకరించట్లేదు.
తమను అధిష్టానం నియమించిందని, వారు సూచిస్తేనే పదవి నుంచి తప్పుకుంటామని చెబుతున్నారు. అటు ఎమ్మెల్యే సైతం ఈ అంశం పట్టించుకోవడం లేదు. దీంతో కొందరు కౌన్సిలర్లు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు. ఎమ్మెల్యేపై అసంతృప్తిగా ఉన్నారు..నెక్స్ట్ ఎమ్మెల్యేకు సహకరించేది లేదని చెబుతున్నారు. దీంతో ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఆశలకు గండిపడినట్లే కనిపిస్తుంది.