ఏపీలో ఎన్నికల సీజన్ మొదలైంది..మరో ఏడాదిన్నరలో ఎన్నికలు మొదలు కానున్నాయి. ఈ సారి కూడా అధికారం దక్కించుకోవాలని వైసీపీ..ఎలాగైనా వైసీపీకి చెక్ పెట్టి అధికారం సొంతం చేసుకోవాలని టీడీపీ చూస్తుంది. ఇక మధ్యలో జనసేన సైతం తమ సత్తా చూపించాలని చూస్తుంది. అయితే జనసేనకు సింగిల్ గా గెలిచే బలం లేదు..పైగా ఓట్లు చీల్చి పరోక్షంగా టీడీపీకి నష్టం, వైసీపీకి లాభం జరిగేలా పరిస్తితి ఉంది. గత ఎన్నికల్లో కూడా అదే జరిగింది.

అందుకే ఈ సారి ఆ పరిస్తితి రాకూడదని పవన్ చూస్తున్నారు. అటు చంద్రబాబు సైతం ఓట్ల చీలిక లేకుండా చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో బాబు-పవన్ కలిసిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ-జనసేనల పొత్తు దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు సర్వే సంస్థలు..రెండు పార్టీల పొత్తు ప్రభావంపై సర్వేలు చేస్తున్నాయి. మొన్నటివరకు విడివిడిగా సర్వేలు చేసిన సంస్థలు..ఇప్పుడు పొత్తుపై సర్వేలు చేస్తున్నాయి.

తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం టీడీపీ-జనసేన పొత్తు ప్రభావంపై సర్వే నిర్వహించి ఓ రిపోర్టు బయటపెట్టారు. దీని ప్రకారం టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీ కంటే 12-14 శాతం ఓట్ల ఆధిక్యంలో ఉన్నాయని చెప్పారు. అలాగే ప్రాంతాల వారీగా చూసుకుంటే. ఉత్తరాంధ్రలో 10-12 శాతం టీడీపీ, జనసేనలకు ఎడ్జ్ ఉంటే.. ఉభయగోదావరి జిల్లాలలో 14-16 శాతం.. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాలలో 12-14 శాతం.. ఒంగోలు- నెల్లూరులలో 8-10. అనంతపురం, కర్నూలులలో 10-12, కడప-చిత్తూరులలో 6-8 టీడీపీ, జనసేన కూటమికి ఎడ్జ్ ఉందని తెలిపారు.

అంటే ఓవరాల్ గా చూసుకుంటే టీడీపీ-జనసేన కూటమి భారీ మెజారిటీతో గెలుస్తుందని అంటున్నారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ టీడీపీ కంటే 10 శాతం ఓట్లు ఎక్కువ తెచ్చుకుని సత్తా చాటింది. దానికే 151 సీట్లు వచ్చాయి. మరి 12-14 శాతం అనేది చాలా ఎక్కువ. మరి ఆ పరిస్తితి ఉంటుందా? లేదా? అనేది చూడాలి.

Leave feedback about this