దేశంలో ఎక్కడా లేని విధంగా రాజధాని అంశంపై చిచ్చు రాజేసి..దానిపై రాజకీయ లబ్ది పొందాలని చెప్పి ఏపీలో అధికార వైసీపీ నానా రకాల ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టిడిపి..రాష్ట్రానికి మధ్యలో ఉంటుందని అమరావతిని రాజధానిగా ప్రకటించింది…దీనికి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఒప్పుకుంది. రాజధాని అమరావతిలో పలు నిర్మాణాలు జరిగాయి.

అయితే 2019 ఎన్నికల్లో రాజధాని అంశం చెప్పకుండా..ఎన్నికల్లో గెలిచాక జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్‌ని తెరపైకి తీసుకొచ్చారు. అమరావతి, కర్నూలు, విశాఖ రాజధానులు అంటూ ఊదరగొట్టారు. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులు అన్నారు. అభివృద్ధి చేయాలంటే ఎలాగైనా చేయవచ్చు. కానీ రాజధానుల పేరుతో రాజకీయ లబ్ది పొందడానికి వైసీపీ స్కెచ్ వేసింది. కానీ న్యాయ వ్యవస్థల్లో ఆ స్కెచ్ వర్కౌట్ కాలేదు. చివరికి మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారు. హైకోర్టు సైతం మూడు రాజధానులు కుదరదని, అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని సూచించింది.

దీనిపై జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. రాజధాని అంశం సుప్రీం కోర్టులో ఉంది. అలా ఉండగానే ఇప్పుడు మూడు రాజధానులు పోయి విశాఖ ఒకటే రాజధాని అంటున్నారు. ఆ మధ్య జగన్, ఇప్పుడు మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి అదే స్టేట్‌మెంట్ ఇచ్చారు. అంటే కర్నూలులో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ ఉంటుందని, అమరావతిలో ఒక సెషన్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని, విశాఖ పూర్తి రాజధానిగా ఉంటుందని అన్నారు.

అంటే ఇంతకాలం మూడు రాజధానుల పేరుతో ఇటు కోస్తా, అటు రాయలసీమ ప్రజలని మోస చేశారని చెప్పవచ్చు. ఇక విశాఖ రాజధాని పేరుతో అక్కడ వైసీపీ చేసే అక్రమాలు తెలుసని ప్రతిపక్షాలు అంటున్నాయి. అయితే ఇలా రాజధానిపై చిచ్చు రేపిన వైసీపీ..అదే రాజధానితో మునగడం ఖాయమని అంటున్నారు.
