తనపై సస్పెన్షన్ ఎత్తివేయకుంటే రానున్న ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇతర పార్టీ లేదా ఇండిపెండెంట్‌గా పోటీచేసే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. బీజేపీ నాయకత్వం సస్పెన్షన్ ఎత్తివేస్తోందన్న నమ్మకం ఉందన్నారు. పార్టీలో బండి సంజయ్ తనకు శ్రీరామరక్ష అన్నారు. సస్పెన్షన్ అంశాన్ని బండి సంజయ్ చూసుకుంటారని నమ్మకం వ్యక్తం చేశారు. తన ప్రవర్తన వలన బీజేపీకి నష్టం కలగలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళే ఆలోచన లేదని, ధర్మం కోసం పనిచేస్తానన్నారు. నాకొస్తోన్న బెదిరింపు కాల్స్ పై కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తున్నానని తెలిపారు. బెదిరింపు కాల్స్‌పై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసినా ఉపయోగం లేదన్నారు. ఇంటిలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలోనే తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చారని పేర్కొన్నారు. ఇప్పుడిచ్చిన వాహనమైనా మంచిగా పనిచేస్తోందని భావిస్తున్నానని నమ్మకం వ్యక్తం చేశారు.


కాగా ఎమ్మెల్యే రాజాసింగ్కు ప్రభుత్వం మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. గతంలో ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మొరాయిస్తుండటంతో ఆయన పలుమార్లు ఆ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, హోం మంత్రి, డీజీపీ దృష్టికి తెచ్చారు. అయినా స్పందన లేకపోవడంతో ఇటీవలే పాత వాహనాన్ని ప్రగతి భవన్ వద్ద వదిలి పెట్టి వచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్కు ప్రభుత్వం మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇచ్చింది. 2017 మోడల్ ఫార్చ్యూనర్ కారును రాజసింగ్ ఇంటికి పంపింది.
