రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రైతులకు గట్టి భరోసా ఇచ్చారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)పై ఆందోళన చెందవద్దని చెప్పారు. రానున్న సంవత్సరాల్లో ఎంఎస్‌పీ నిరంతరం పెరుగుతుందని తెలిపారు. నూతన వ్యవసాయ సంస్కరణల నేపథ్యంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో ఆయన ఈ హామీ ఇచ్చారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో నూతన వ్యవసాయ సంస్కరణ బిల్లులు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈ బిల్లులపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం సంతకం చేయడంతో చట్టాలుగా అమల్లోకి వచ్చాయి. ఈ సంస్కరణల వల్ల రైతులకు హాని జరుగుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తోంది. కాంగ్రెస్ యువజన విభాగం సోమవారం దేశ రాజధాని నగరంలోని ఇండియా గేట్ వద్ద నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఓ ట్రాక్టర్‌ను తగులబెట్టారు. దీనిపై రాజ్‌నాథ్ సింగ్ ఘాటుగా స్పందించారు.
సైనికునికి ఆయుధం పవిత్రమైనదని, అదేవిధంగా రైతుకు ట్రాక్టర్ పవిత్రమైనదని, అలాంటి ట్రాక్టర్‌ను కాల్చి, రైతులను అవమానిస్తున్నారని రాజ్‌నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రైతు బిడ్డగా చెప్తున్నానని, మోదీ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏదీ చేయబోదని చెప్పారు. ఏ సమస్య ఉన్నా తమతో చర్చించాలని రైతు సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. అపోహలను తొలగించేందుకు తాను ఇప్పటికే రైతు సంఘాలతో మాట్లాడుతున్నానని తెలిపారు.
‘‘ఎంఎస్‌పీ కొనసాగుతుందని, అంతేకాకుండా, రాబోయే సంవత్సరాల్లో అది నిరంతరం పెరుగుతుందని రైతులకు హామీ ఇస్తున్నాను’’ అని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.