May 28, 2023
News

రామోజీ అంటే ఒక బ్రాండ్

60 ఏళ్లుగా తెలుగువారికి రామోజీరావు అంటే ఒక బ్రాండ్. ఒక నమ్మకం. విలువలకు నిలువెత్తు విగ్రహం. ఆయన నిర్వహించే సంస్థలు అన్నీ కూడా చాలా కచ్చితత్వంతో పనిచేస్తాయి. ఉదాహరణకు చెప్పాలంటే ఎన్ని న్యూస్ ఛానెల్స్‌ ఉన్న అది నిజమో కాదో తెలియాలి అంటే ప్రతి ఒక్కరూ ఈటీవీ చూస్తారు. కారణం ఏంటంటే ఏదైనా ఒక వార్త కరెక్టు అయితేనే వారు ప్రసారం చేస్తారు. రేటింగ్‌ల కోసం దిగజారటం, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడటం, ఊహాగానాలు అల్లటం వంటివి వారు చేయరు. సాక్షి పేపర్‌, టీవీలాగే సొంత డబ్బా కొట్టుకోరు. రామోజీరావు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ అడ్వర్ట్‌యిజ్‌మెంట్లు ఇచ్చినా తీసుకోరు. ఆయన రావాలే కానీ ఎన్ని సభలు, ఎన్ని సత్కారాలు, ఎన్ని బిరుదులు ఇస్తారో లెక్కేలేదు. కానీ ఆయన ఎన్నడూ ప్రచారాలకు దూరంగా మౌనమునిలా ఉంటారు. విదేశాలకు కూడా వెళ్లినట్టు ఎక్కడా చూడలేదు. నిరంతరం పని..పని..పని.

మార్గదర్శి విషయానికి వస్తే అక్కడ ఎలాంటి రికమండేషన్‌లు పనిచేయవు. ఎవరికైనా ఒకటే ప్రాసెస్. అందులో పనిచేసే వారికైనా అంతే. మార్గదర్శి వాళ్లు ఎక్కవు రూల్స్ చెబుతారు అని కొందరు అనుకుంటారు. ఎందుకంత కఠినంగా ఉంటారంటే అది జనం డబ్బులు కాబట్టి చాలా బాధ్యతగా ఉంటారు. అందుకే 60 ఏళ్లుగా ఉన్న ఈ సంస్థపై ఈరోజుకూ ప్రజలకు విశ్వాసం. గత 60 ఏళ్లలో ఎన్నో చిట్‌ఫండ్స్‌, ఎన్నో ఆర్థిక సంస్థలు, బ్యాంకులు దివాళ తీసాయి. ICICI బ్యాంకు మీద లోగడ ఎప్పుడో ఛానెల్స్‌లో ఏదో వార్త వచ్చిందని జనం విరగబడ్డారు తమ డబ్బులు వెనక్కి తీసుకోవటం కోసం. పెద్దపెద్ద బ్యాంకుల పట్ల కూడా లేని నమ్మకం మార్గదర్శిపై ఉందంటే కారణం. రామోజీరావు. ఆయన గ్రూపు సంస్థలు పాటించే వృత్తి ప్రమాణాలు.

హిండెన్‌బర్గ్‌ ఎగ్జాంపుల్‌ చాలు…..

హిండెన్ బర్గ్‌ రిపోర్ట్ అంట. అమెరికా నుంచి రిలీజ్ చేశారట. ఆ సంస్థ ఏంటి? ఎవరిది అది? దానికి ఉన్న క్రెడిబులిటీ ఏంటి? వాళ్ల అడ్రెస్ ఏంటి? ఎవరికీ తెలియదు. భారతదేశంలో నెంబర్‌ వన్ పారిశ్రామికవేత్త అయిన గౌతమ్ అదానీవి అన్నీ డొల్ల వ్యాపారాలు అని ఏదో అమెరికా నుంచి ఒక నివేదిక రిలీజ్ చేశాడట. అంతే భారతదేశ స్టాక్‌ మార్కెట్లు లక్షలకోట్ల రూపాయలు నష్టపోయాయి. మన దేశ ఇన్వెస్టర్లు దారుణాతి దారుణంగా నష్టపోయారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారు అందరూ ఆ నివేదిక వల్ల షేర్ల ధరలు పతనమై ఆర్థికంగా చితికిపోయారు. అసలు ఆ హిండెన్‌బర్గ్ నివేదికలో చెప్పింది నిజమా? కాదా అని కూడా ఆలోచన చేయలేదు. భారతప్రభుత్వం కూడా ఆదానీపై ఏ చర్యా తీసుకోలేదు. కానీ మదుపర్లు మాత్రం ఆ హిండెన్‌ బర్గ్ ప్రచారాన్ని నమ్మారు. ఒక్కసారి ఆదానీ కంపెనీల్లో పెట్టిన తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. కానీ మార్గదర్శిని మాత్రం ఖాతాదారులు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. కారణం రామోజీరావు గారిపై వారికి ఉన్న విశ్వాసం. అందుకే ఆయన తనని ఇంతగా ప్రేమించే ప్రజల కోసం పరితపిస్తారు.