అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని దక్కించుకున్న వైసీపీ నాయకుడు.. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ వ్యూహం లేకుండా ముందుకు సాగుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇదేదో.. బయటవారు..ఆయనంటే కిట్టనివారు చెబుతున్న మాట కాదు. సాక్షాత్తూ.. వైసీపీ నాయ కులే అంటున్నారు. వాస్తవానికి ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. పైగా పరిటాల కుటుంబానికి ఇక్కడ బోలెడు సింపతీ ఉంది. 2009, 2014 ఎన్నికల్లో పరిటాల సునీత విజయం దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో మాత్రమే పరిటాల వారసుడిగా రంగ ప్రవేశం చేసిన శ్రీరాం.. స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు.

అయితే.. గత రెండున్నరేళ్లుగా.. ఇక్కడ శ్రీరాం.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రజలకు చేరువ అవుతున్నారు. సమస్యలు తెలుసుకుంటున్నారు. కేసులకు కూడా వెరవకుండా.. నేనున్నానంటూ.. ముందుకు వస్తున్నారు. అంతేకాదు.. ప్రభుత్వంపై చేపట్టే అన్ని కార్యక్రమాలకూ ఆయన నేతృత్వం వహిస్తున్నారు. దీంతో టీడీపీ భారీ ఎత్తున పుంజుకుంది. ఇటీవల జరిగిన ఇంటింటి సర్వేలో శ్రీరాంకు అనుకూలంగా భారీ ఎత్తున స్పందన వచ్చింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. ఆయన గెలుపును ఎవరూ ఆపలేరనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఏదో ఒకటి చేసి.. తనదే పైచేయి అనుకునేలా వ్యవహరిస్తున్నారని.. వైసీపీలో నేతలే కామెంట్లుచేస్తున్నారు.

అంతేకాదు.. గత ఎన్నికలకు ముందు.. ఇక్కడి రెడ్డి సామాజిక వర్గం ఆయనను ఎంతో మోసింది. మావోడు ఎమ్మెల్యే అయితే.. మాకు ఏదైనా చేస్తాడు.. అని అనుకున్నారు.కానీ, రెండున్నరేళ్లు అయినా.. ఇప్పటి వరకు ఆయన చేసింది ఏమీలేదని గుసగుస వినిపిస్తోంది. పైగా సమస్యలను వదిలేసి.. ప్రజలను కలవడం మరిచిపోయి.. పైపైన ఏవో చేస్తున్నారనేది ప్రధానంగా వస్తున్న విమర్శ. ఇటీవల ఒక చెరువు విషయంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు స్థానికంగా తీవ్ర గందరగోళానికి గురి చేసింది. దీంతో రంగంలోకి దిగిన సునీత, శ్రీరాంలు.. ఇక్కడ ధర్నా చేశారు. దీనికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. అదేవిధంగా.. భూముల కబ్జా కూడా పెరిగిపోయిందనే ఆరోపణలు ఎమ్మెల్యే చుట్టూ హల్‌చల్ చేస్తున్నాయి.

నగర శివారులోని జన్మభూమి కాలనీలో కోట్ల రూపాయలు విలువ చేసే మూడు ఎకరాలను ఆక్రమించే యత్నం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. జేసీబీలతో కాలనీలో ఇళ్ల పునాదులను నేలమట్టం చేయడంతో పాటు ఫెన్సింగ్‌ను ధ్వంసం చేశారు. జన్మభూమి కాలనీ వాసులు వేసుకున్న ఫెన్సింగ్‌ను, ఇళ్లను రాత్రికి రాత్రే జేసీబీలతో ఎమ్మెల్యే అనుచరులు నేలమట్టం చేశారు. ఎమ్మెల్యే అనుచరుల తీరుపై జన్మభూమి కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు కబ్జా చేస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఇదేం తీరు? అనే ప్రశ్నలు ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పటికే గ్రాఫ్ పడిపోయిందని స్పష్టం అవుతున్నా.. ఇంకా మేల్కొనే పరిస్థితి లేక పోతే.. మొత్తానికే మోసం వస్తుందని అంటున్నారు.

Discussion about this post