రాజకీయాల్లో నిలదొక్కుకునేందుకు ఎన్ని మార్గాలు ఉన్నా.. అంతిమంగా ప్రజల నుంచి మంచి మార్కులు వేయించుకోవాల్సిందే. ఎంత బలం ఉన్నా.. ఎంత ఆర్థిక దన్ను ఉన్నా.. ప్రజల మద్దతు లేకపోతే.. ప్రతిపక్షానికే పరిమితమవుతున్న నాయకులు కళ్ల ముందు కనిపిస్తున్నారు. అయితే.. ఈ విషయం గ్రహించారో.. లేదో తెలియదు కానీ.. వైసీపీ కీలక నాయకుడు.. ఎన్నాళ్లో విజయం కోసం.. నిరీక్షించిన నాయకుడు.. తోపుదుర్తి ప్రకాష్ మాత్రం.. దారి తప్పుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం నుంచి 2019లో విజయం సాధించిన తోపుదుర్తి.. ఈ విజయం అందుకునేందుకు ఎంతో శ్రమించారనేది వాస్తవం.

మూడు ఎన్నికల్లో ఆయన శ్రమిస్తేనే, ప్రజలకు చేరువ అయితేనే.. ఆయన గత ఎన్నికల్లో విజయం సాధించారు. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీతపై తోపుదుర్తి పరాజయం పాలయ్యారు. 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిన తర్వాత.. వైసీపీలోకి వచ్చారు. ఈ క్రమంలో 2014లో ఆపార్టీ టికెట్‌పై పోటీ చేసి మరోసారి పరాజయం పాలయ్యారు. అయితే.. 2014లో విజయం దక్కింది. దాదాపు పాతికవేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో ఆయన విజయం దక్కించుకున్నారు.

అయితే.. ఇది ఆయన వ్యక్తిగత విజయమా? లేక వైసీపీ సునామీనా.. జగన్ పాదయాత్ర ఫలితమా? అనే చర్చ జోరుగానే ఉంది. ఇదిలావుంటే.. వచ్చే ఎన్నికలకు సంబంధించి అందరు నాయకులు ప్రిపేర్ అవుతుంటే ప్రకాశ్ రెడ్డి మాత్రం ఎక్కడా ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నారనే వాదన వైసీపీ వర్గాల నుంచే వినిపిస్తోంది. ప్రభుత్వమే అన్నీ చేస్తున్నప్పుడు.. మేం చేసేది ఏముంది? అని ఇటీవల ప్రకాష్‌రెడ్డి సోదరుడు వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. నిజానికి తోపుదుర్తి వంటి నాయకుడు.. ఎంతో శ్రమించాల్సిన అవసరం ఉందని.. వైసీపీ నాయకులే అభిప్రాయపడుతున్నారు. “క్షేత్రస్థాయిలో టీడీపీకి అనుకూల బలం ఉంది. ముఖ్యంగా పరిటాల కుటుంబంపై సానుభూతి పెరుగుతోంది. గత ఎన్నికల్లో పరిటాల శ్రీరాం ను ఓడించడంపై కొందరు మదన పడుతున్నారు. ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ సోదరుల దూకుడు విసుగు తెప్పిస్తోంది.

పోనీ.. అభివృద్ధి విషయంలో ఆయన పోటీ పడుతున్నారా? అంటే అది కనిపించడం లేదు. కేవలం విమర్శలు.. ప్రతివిమర్శ లు.. సవాళ్లు ప్రతిసవాళ్లతో పరిటాల ఫ్యామిలీ వ్యూహంలో ఆయన చిక్కుకుంటున్నారనే అనిపిస్తోంది. దీంతో అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. దీనికి రేపు మూల్యం చెల్లించాల్సి వస్తే.. ఎవరు బాధ్యులు“ అని కొందరు నాయకులు బాహాటంగానే అంటున్నారు.

Discussion about this post