గుంటూరు జిల్లాకు చెందిన కీలక నాయకుడు.. రాజకీయ కురువృద్ధుడు రాయపాటి సాంబశివరావు.. రాజకీయాల్లో ఉన్నారా? లేరా? ఉంటే.. ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? వచ్చే ఎన్నికల్లో ఆయనపోటీ చేస్తారా? ఇవీ.. ఇప్పుడు టీడీపీలో జరుగు తున్న ఆసక్తికర చర్చలో కీలక అంశాలు. వయోవృద్ధుడే అయినప్పటికీ.. కమ్మ సామాజిక వర్గంతోపాటు.. మాస్‌లోనూ రాయపాటి కుటుంబానికి గుర్తింపు ఉంది. ఆయన చేసిన సేవలు కావొచ్చు.. అవినీతి రహిత రాజకీయం కావొచ్చు..రాయపాటి ఫాలోయింగ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఎవరూ వేలెత్తి కూడా చూపించే పరిస్థితి అయితే.. లేదు.

అయితే.. ఇప్పుడు ఆయన టీడీపీలోనే ఉన్నా.. ఎక్కడా వాయిస్ వినిపించడం లేదు. గత ఎన్నికల్లోనే వయోవృద్ధుడనే కారణం గా.. టీడీపీలో రాయపాటికి అవకాశం చిక్కదనే వార్తలు వచ్చాయి. అయితే.. అప్పట్లో కొంత హడావుడి చేసిన రాయపాటి.. ఎట్టకే లకు సీటు దక్కించుకున్నా.. ఓడిపోయారు. ఇక, ఆ తర్వాత.. నుంచి ఆయన ఎక్కడా కనిపించడం లేదు. పోనీ.. ఆయనను పక్కన పెట్టినా.. ఆయన కుమారుడు కూడా ఎక్కడా కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో తన వారసుడిగా.. కుమారుడు రంగా రావు పోటీ చేస్తారని కొన్నాళ్ల కిందట ప్రకటించినా.. ఆ దిశగా అడుగులు పడలేదు. నిజానికి రాయపాటి వర్గానికి ఉన్న ఫాలో యింగ్‌ను దృష్టిలో పెట్టుకుంటే.. సీటు ఖాయమే.

అయితే.. రంగారావు కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఒకవైపు పార్టీ అధినేత చంద్రబాబు జనాల్లోకి వచ్చి.. పార్టీని పరుగులు పెట్టించాలని భావిస్తున్నారు. జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. అయినప్పటికీ.. రంగారావు ఊసు ఎక్కడా వినిపించడం లేదు. పోనీ.. కేడర్ లేదా.. అంటే ఉంది. బలమైన కేడర్‌ను ఉంచుకుని కూడా ఇలా.. వ్యవహరించడంపై.. అసలు రాయపాటి వ్యూహం ఏంటనేది.. ఎవరికీ అర్ధం కావడం లేదు. సత్తెనపల్లి సీటును ఆశించిన.. ఈ కుటుంబానికి చంద్రబాబు నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదని.. అందుకే వారు మౌనంగా ఉన్నారని.. చెబుతున్న ఒకే ఒక్క కారణం తప్ప.. మరేమీ కనిపించడం లేదు.

పోనీ.. ఇది కాకుంటే.. నరసరావుపేట నియోజకవర్గం ఎలానూ ఉంది. ఈ సీటును ఇచ్చేందుకు చంద్రబాబుకు కూడా ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. సో.. ఇక్కడైనా రాయపాటి ఫ్యామిలీ డెవలప్ చేసుకునేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ.. రాయపాటి కుటుంబం మాత్రం మౌనముద్రను వీడడం లేదు. దీంతో వీరినే నమ్ముకున్న కేడర్‌లోనూ నిరుత్సాహం ఏర్పడుతోంది. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్నాయి. వైసీపీ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచైనా ఎంచుకున్న నియోజకవర్గంలో దూకుడు రాజకీయం ప్రారంభించాలని.. కేడర్ ముక్తకంఠంతో కోరుతోంది. పెద్దాయన ను పక్కన పెట్టినా.. రంగారావును రంగంలోకి దిగాలని కోరుతోంది. మరి ఏం చేస్తారో చూడాలి.

Discussion about this post