రాష్ట్ర వ్యవహారాలపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ దృష్టి పెట్టిందా..? పార్టీని తన అదుపులో ఉంచుకోవాలని యోచిస్తోందా..? ఆ నియామకంతో రేవంత్ ముందరి కాళ్లకు బంధం వేసిందా..? పార్టీలో వ్యక్తిగత ఇమేజ్ ను నిలువరించాలని భావిస్తోందా..? మరో వైఎస్ ఎపిసోడ్ కావొద్దని కోరుకుంటోందా..? రేవంతుపై సీనియర్ల ఫిర్యాదుతో పరోక్ష చర్యలు చేపట్టిందా..? అంటే ఆ పార్టీలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో రాష్ట్ర కాంగ్రెస్ ను శాసించారు. వైఎస్ ప్రతిపాదనలకు అధిష్ఠానం ఓకే చెప్పడంతో ఆయనకు తిరుగులేకుండా పోయింది. సీఎల్పీ నేత హోదాలో ఉమ్మడి రాష్ట్రమంతా పాదయాత్ర చేసి టీడీపీ ప్రభంజనానికి చెక్ పెట్టారు. వ్యక్తిగత ఇమేజ్ తోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. 2004, 09లో రెండుసార్లు పార్టీ పవర్ లోకి రావడానికి వైఎస్ ఇమేజే కారణమని ఎవరిని అడిగినా చెబుతారు. 2009లో చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పోటీలో ఉన్నా.. త్రిముఖ పోరులో ఓట్లు చీలిపోయినా స్వల్ప మెజారిటీతో పార్టీని గట్టెక్కించారు వైఎస్.
వైఎస్ హయాంలో పార్టీ హవా కంటే కూడా వ్యక్తిగతంగా ఆయనకే లాభం జరిగిందని అధిష్ఠానం భావిస్తోంది. వైఎస్ ఆ ధీమాతోనే ఒకదశలో పార్టీ అధ్యక్షురాలు సోనియాను కూడా ఎదిరించారట. ఆ ధీమానే ఆయన కుమారుడు జగన్ పార్టీని ధిక్కరించి వేరే పార్టీ పెట్టుకోవడానికి కారణమైందట. దీంతో అలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని అధిష్ఠానం ఆలోచనగా ఉంది. అందుకే రేవంత్ కు వ్యక్తిగత ఇమేజ్ రాకుండా జాగ్రత్త పడుతోంది.
కేసీఆర్ ధాటికి అస్తవ్యస్త దిశలో కొట్టుకుపోతున్న రాష్ట్ర కాంగ్రెస్ కు ఒకరకంగా రేవంత్ నియామకం బూస్టు ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఆయనకు కాకుండా ఇంకా ఎవరికి ఇచ్చినా ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్, బీజేపీకి దీటుగా నిలబడేదే కాదు. అది గుర్తించే అధిష్ఠానం ఆయనకు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది. అయితే రేవంత్ పార్టీ కోసం పనిచేస్తూనే వ్యక్తిగతంగా ఎదగాలని ప్రయత్నిస్తున్నారు. సీనియర్లతో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలతో ముందుకెళుతున్నారు. దీంతో అధిష్ఠానానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
త్వరలో రేవంత్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నియోజకవర్గాల్లో తనకు నచ్చిన వారిని అభ్యర్థులుగా ప్రకటించుకుంటున్నారు. సీనియర్ల ఫిర్యాదుతో ఇది గుర్తించిన అధిష్ఠానం ఆయనకు వ్యక్తిగత ఇమేజ్ రాకుండా ఇతర శక్తులను కూడా తెరపైకి తెస్తోంది. తాజాగా స్టార్ క్యాంపెయినర్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమించింది. టికెట్ల వ్యవహారం కూడా సునీల్ సర్వే ద్వారా అధిష్ఠానం చేతుల్లోకే వెళ్లనుంది.
రేవంత్ అంటేనే చిందులు తొక్కే కోమటిరెడ్డికి కీలక పదవి ఇవ్వడం ద్వారా.. వ్యక్తుల కంటే పార్టీయే ముఖ్యమని చెప్పకనే చెప్పినట్లు అయింది. ఇకపై రేవంతుతో పాటు కోమటిరెడ్డి కూడా రాష్ట్రవ్యాప్తంగా తిరిగే అవకాశం కల్పించినట్లు అయింది. టికెట్ల అంశంలో కూడా రేవంత్ మాట నెగ్గకపోవచ్చు. కోమటిరెడ్డికి పదవిపై రేవంత్ అభినందనలు తెలిపినా లోలోపల ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అధిష్ఠానం తనకు వ్యతిరేకంగానే పరోక్షంగా సీనియర్లను ప్రోత్సహిస్తోందనే భావనలో ఉన్నారు. ఇకపై రేవంత్ ఎత్తులు ఎలా ఉంటాయో.. పార్టీలో ఆయన మాట ఎంత వరకు చెల్లుబాటు అవుతుందో వేచి చూడాలి.
Discussion about this post