మొత్తానికి తెలుగు తమ్ముళ్ళు అనుకున్నదే జరిగింది..అనుమానించిందే అయింది. వరుసగా చంద్రబాబు సభల్లో తొక్కిసలాట జరిగి పలువురు మృతి చెందడం..ఈ ఘటనలపై వైసీపీ నేతలు, వైసీపీ మీడియా ఒకేలా టార్గెట్ చేసి బాబుపై విమర్శలు చేయడం చేశారు. ఇక ఈ ఘటనల వెనుక వైసీపీ కుట్ర ఉందని, ఏదో స్కెచ్ వేశారని..దీన్ని అడ్డం పెట్టుకుని బాబుని ఇంకా జనంలోకి వెళ్లకుండా స్కెచ్ వేస్తున్నారని తమ్ముళ్ళు అనుమానించారు.

ఇక అనుమానించిందే తాజాగా వైసీపీ ప్రభుత్వం అమలు చేసింది. పంచాయతీరాజ్, మున్సిపల్, జాతీయ రహదారులపై సభలు, ర్యాలీలు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. అధికారులు నిర్ణయించిన ప్రదేశంలో మాత్రమే సభలు పెట్టాలని, ఈ సభలకు కూడా షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని సూచనలు చేసింది. వీటిని ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. అయితే ఇటీవల చంద్రబాబు సభలకు జనం పోటెత్తుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చిందని తమ్ముళ్ళు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో జగన్ వరుసపెట్టి భారీ సభలు పెడుతున్న విషయం తెలిసిందే..అలాగే రాజమండ్రిలో రోడ్ షో కూడా నిర్వహించనున్నారు. దీనిపై కూడా విమర్శలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే రానున్న రోజుల్లో బాబు టూర్లపై ఎలాంటి ఆంక్షలు కొనసాగుతాయనే దానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. 4వ తేదీన బాబు కుప్పం టూర్ ఉంది..మరి అప్పుడు పర్మిషన్ ఇస్తారా? లేక బాబుకు బ్రేకులు వేస్తారా? అనేది క్లారిటీ లేదు. ఇక జనవరి 27న లోకేష్ పాదయాత్ర మొదలు కానుంది. పాదయాత్ర రోడ్లపైనే చేయాలి..అలాగే కూడళ్ళలో సభలు పెట్టాలి. గతంలో జగన్ ప్రతిపక్షంలో ఉండగా అదే చేశారు.

అటు పవన్ బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు..బస్సు యాత్ర అంటే రోడ్లపైనే చేయాలి..మరి ఈ విషయాల్లో వైసీపీ ప్రభుత్వం ఎలా ముందుకెళుతుందనేది అర్ధం కాకుండా ఉంది.
