నగరి ఎమ్మెల్యే రోజాకు ప్రత్యర్ధి పార్టీ టిడిపితో కంటే సొంత పార్టీ నేతలతోనే పెద్ద తలనొప్పి ఎదురవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే నగరిలో రోజాకు వ్యతిరేకంగా మరొక వర్గం రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. ఆ వర్గంతో రోజాకు పెద్ద తలనొప్పి అయిపోయింది. ఎక్కడకక్కడ రోజాకు వర్గపోరుతో ఇబ్బంది అవుతుంది. ఇక రోజాకు వ్యతిరేక వర్గాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నడిపిస్తున్నారనే టాక్ ఉంది.

అయితే ఆ వ్యతిరేక వర్గం వల్ల రోజా పరువు పోయే వరకు వచ్చింది. తాజాగా ఎంపీపీ ఎన్నికల్లో రోజాకు వ్యతిరేక వర్గం చుక్కలు చూపించింది. నగరి నియోజకవర్గంలోని నిండ్ర మండలంలో ఎంపీపీ ఎన్నిక వైసీపీలో వర్గవిభేదాలతో వాయిదా పడుతూ వెళుతుంది. మండలంలోని 8 ఎంపీటీసీల్లో వైసీపీకి 7, టీడీపీకి 1 దక్కాయి. ఇందులో ఎమ్మెల్యే రోజా వ్యతిరేకవర్గమైన వైసీపీ నేత భాస్కర్‌రెడ్డి వైపు ఐదుగురు ఉన్నారు. రోజా వైపు ఇద్దరు ఉండగా.. టీడీపీ ఎంపీటీసీ కూడా మద్దతు ఇస్తున్నారు. ఎంపీపీ పీఠం కోరం తనవైపు ఉందని భాస్కర్ రెడ్డి వాదిస్తున్నారు. ఎమ్మెల్యే రోజా ఒత్తిడితో అధికారులు ఎన్నికని వాయిదా వేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

తాజాగా ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి రోజా పెద్ద రచ్చే చేశారు. ప్రమాణస్వీకారాన్ని కూడా అడ్డుకున్నారు. రోజా విప్ జారీ చేసి, సంతకం పెట్టి ఇచ్చేంత వరకు ప్రమాణం చేయించబోరని హడావిడి చేశారు. ఈ క్రమంలోనే అధికారులు ఎన్నికని వాయిదా వేశారు. ఇక అక్కడే భాస్కర్ రెడ్డితో రోజా వాగ్వాదానికి దిగారు. దమ్ముంటే ఇండిపెండెంట్‌గా గెలిచి చూపించాలని రోజా సవాల్ విసిరారు.

అలాగే అటు నుంచి కూడా రోజాకు సవాల్ చేశారు. రోజా కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా గెలిచి చూపించాలని భాస్కర్, చక్రపాణి రెడ్డిలు సవాల్ చేశారు. వైసీపీ లేకపోతే రోజాకు గెలిచే సీన్ లేదని అంటున్నారు. అయితే గత రెండు పర్యాయాల నుంచి వైసీపీ తరుపున స్వల్ప మెజారిటీ తేడాలతోనే గెలుస్తూ వచ్చారు. మరి ఈ సారి వ్యతిరేక వర్గం ప్రభావంతో రోజాకు చుక్కలు కనిపించేలా ఉన్నాయి.

Discussion about this post