రాజకీయాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. ఎప్పుడైనా మారొచ్చు. ఎలాగైనా మారొచ్చు. ఇలాంటి పరిస్థితిని తట్టుకునేందుకు నాయకులు ఎప్పుడూ.. రెడీగానే ఉంటారు. అయితే.. ఇది ప్రత్యర్థుల నుంచి సమస్య ఎదురైనప్పుడు.. నేతలు రెడీగా ఉంటారు. కానీ, సొంత పార్టీ నేతలే.. కత్తి కడితే..?! సొంత పార్టీ నేతలే.. ఎమ్మెల్యేను ఓడించాలని నిర్ణయం తీసుకుంటే.. ఏం చేయాలి? ఇదే ఇప్పుడు.. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో జరుగుతోంది. ఎవరు ఔనన్నా.. ఎవరు కాదన్నా.. ఇక్కడి నుంచి వరుస విజయాలు దక్కించుకున్న వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాను ఓడించాలని.. సొంత పార్టీ నేతలే భావిస్తున్నారు.

అయితే.. వీరేమీ.. ప్రత్యర్థి పార్టీ నేతలతో కుమ్మక్కు కాలేదు. అలాగని.. ఎమ్మెల్యే రోజా ను మరోసారి ఎమ్మెల్యేగా చూడాలని కూడా అనుకోవడం లేదు. స్వయంకృతంగా ఆమె చేస్తున్న రాజకీయాలు.. ఆమెకు ఎబ్బెట్టుగా మారుతున్నాయి. ఆమె దూకుడు బాగానే ఉన్నా.. అందరినీ కలుపుకొని పోవడం లేదు. అందరితోనూ సఖ్యతగా ఉండడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. ఒంటెత్తు పోకడలకు పరాకాష్టగా మారిందనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. తనను ప్రశ్నించిన వారిపై సొంత పార్టీ నేతలనా.. ఆమె కేసులు పెట్టిస్తున్నారు. అధికారులతో మాట్లాడి.. దాడులు చేస్తున్నారు.. అని వైసీపీ నేతలు చెబుతున్నారు.

ఇది వ్యక్తిగతంగానే కాకుండా.. రాజకీయంగా కూడా రోజాపై తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకునేలా చేస్తోంది. వాస్తవానికి ఆమె ఇక్కడ అనేక సంక్షేమ కార్యక్రమాలుచేస్తున్నారు. ప్రజలకు చేరువ అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనుసరిస్తున్న ఒక రాజకీయ వ్యూహాన్ని ఆమె నియోజకవర్గంలో పాటిస్తున్నారు. అయితే.. రాష్ట్రం లెక్కలు వేరుగా ఉంటాయి. నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. రాష్ట్రంలో 50 చోట్ల పార్టీ ఓడిపోయినా.. మిగిలిన చోట్ల గెలిస్తే.. అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది.

కానీ.. రోజా ఒక్కతే.. నియోజకవర్గంలో ఓడిపోతే.. తను వ్యక్తిగతంగా చాలా నష్టపోతుంది. ఇదే విషయాన్ని ఆమె సానుభూతి పరులు కూడా చెబుతున్నారు. అయినప్పటికీ.. ఆమె మారడం లేదని.. తమ పంతం నెగ్గించుకుంటామని .. మెజారిటీ నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Discussion about this post