ఫైర్ బ్రాండ్ నాయకురాలుగా ఉన్న రోజాకు ప్రత్యర్ధులతో కంటే సొంత పార్టీ నేతలతోనే ఫైట్ చేయాల్సిన పరిస్తితి. నగరి నియోజకవర్గంలో ఆమె ఎప్పటికప్పుడు సొంత నేతల విమర్శలని ఎదురుకోవాల్సి వస్తుంది. అసలు రెండోసారి గెలిచామనే ఆనందం కూడా రోజాకు దక్కుతున్నట్లు కనిపించడం లేదు. ఎక్కడకక్కడ నేతలు రోజాకు సహకరించని పరిస్తితి. పైగా నగరిలో రోజాకు వ్యతిరేకంగా రాజకీయం నడుస్తోంది. ఈ పరిణామాలు రోజాకు బాగా మైనస్ అయ్యేలా ఉన్నాయి.

రాజకీయాల్లో మొదట్లో రోజాకు కాస్త దురదృష్టం వెంటాడిన తర్వాత నుంచి కాస్త అదృష్టం కలిసొచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే రోజా రెండుసార్లు నగరి నుంచి స్వల్ప మెజారిటీలతోనే గెలిచారు. 2014లో గెలిచినప్పుడు..ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి పెద్దగా ఆధిపత్య పోరు ఎదురుకాలేదు. కానీ 2019లో గెలిచాక వైసీపీ కూడా అధికారంలోకి రావడంతో పరిస్తితి మొత్తం మారిపోయింది. నగరిలో ఆధిపత్య పోరు పెరిగిపోయింది. రోజాకు వ్యతిరేక వర్గాలు యాక్టివ్ అయ్యాయి. ఆ వర్గాలు ఆమెకు ఏ మాత్రం సహకరించని పరిస్తితి.

ఇటీవల స్థానిక ఎన్నికల్లో ఒక ఎంపీపీ స్థానం విషయంలో రోజా వ్యతిరేక వర్గం చుక్కలు చూపించింది. దీంతో ఆమె అధిష్టానానికి ఫిర్యాదు చేయడం…పెద్దిరెడ్డికి చెప్పడం లాంటి కార్యక్రమాలు చేశారు. ఎలాగోలా లోకల్ గోల తప్పింది. కానీ తాజాగా మరికొందరు నేతలు…రోజాకు వ్యతిరేకంగా గళం విప్పారు. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేసిన తమ మీద తప్పడు కేసులు పెట్టి, జైళ్లకు పంపుతున్నారని వారు అంటున్నారు.

ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీ అనుచరులుగా స్మగ్గర్లు, రౌడీలు అధికమయ్యారని మాజీ మున్సిపల్ చైర్మన్ కే.జే.కుమార్, శ్రీశైలం ఆలయ బోర్డు ట్రస్ట్ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఏపీ ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ కేజే శాంతిలతో పాటు పలువురు నేతలు రోజాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరు పూర్తిగా రోజాకు వ్యతిరేకంగా ముందుకెళుతున్నారు. వచ్చే ఎన్నికల వరకు ఇదే పరిస్తితి కొనసాగితే…రోజాకు మాత్రం ఈ సారి గెలవడం కష్టమైపోతుందనే చెప్పాలి.

Discussion about this post