ఏపీలో అధికార వైసీపీపై వ్యతిరేకత పెరుగుతున్న విషయం తెలిసిందే. పైకి అధికార బలం ఉండటం వల్ల కనబడటం లేదు గానీ, క్షేత్ర స్థాయిలో చూస్తే వైసీపీ పాలనపై ప్రజలు కాస్త అసంతృప్తిగానే ఉన్నారని సంగతి అర్ధమవుతుంది. ఇక ప్రతిపక్షాలు, వైసీపీ ప్రభుత్వంపై ఎలా విమర్శలు చేస్తున్నాయో చెప్పాల్సిన పని లేదు. ఒక పార్టీ అని కాదు…అన్నీ పార్టీలు జగన్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నాయి. ప్రభుత్వ విధానాలని తప్పుబడుతున్నాయి.

ప్రతిపక్షాలు తప్పుబడితే పర్లేదు…సొంత పార్టీ నేతలు సైతం పార్టీ విధానాలని తప్పుబట్టే పరిస్తితి. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్తితులపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇంతకాలం ఎంపీ రఘురామకృష్ణం రాజు మాత్రమే…వైసీపీపై విమర్శలు చేస్తూ కనిపించారు. ఇప్పుడు సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డి సైతం…రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని తప్పులని ఎత్తి చూపుతున్నారు.

అయితే మొదట్లోనే ఆనం…అధికారులపై విమర్శలు చేశారు. అలాగే మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరి మధ్యలో ఏమైందో గానీ ఆయన కాస్త సైలెంట్ అయ్యారు. తాజాగా మాత్రం ఆనం…మళ్ళీ నోరు విప్పారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే రాష్ట్రంలో నక్సలిజం, టెర్రరిజం తగ్గుముఖం పట్టిందని, అయితే లోకల్ మాఫియా పేట్రేగిపోతోందని కామెంట్ చేశారు.

అంటే వైసీపీ ప్రభుత్వంలో లోకల్ మాఫియా ఎక్కువైందనే కోణంలో ఆనం మాట్లాడారు. ఈ లోకల్ మాఫియాతో కొందరు పోలీసులు కూడా చేతులు కలిపారని, పోలీస్ స్టేషన్‌కు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో రోజురోజుకూ సన్నగిల్లుతోందని అన్నారు. ఆనం చేస్తున్న విమర్శలు…టీడీపీ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంది. పోలీసులు వన్‌సైడ్‌గా వ్యవహరిస్తున్నారని, కొందరికి మాత్రమే సపోర్ట్‌గా ఉంటున్నారని విమర్శలు చేస్తూనే ఉంది.

తాజాగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సైతం పోలీస్ వ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రభుత్వంలో ఉన్న లోపాలని చెబుతున్న రఘురామని వైసీపీ ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో తెలిసిందే. మరి ఆనంని కూడా కట్టడి చేయడానికి ప్రయత్నిస్తారేమో చూడాలి.

Discussion about this post