Site icon Neti Telugu

టీడీపీ తెనాలి త్యాగం..నాదెండ్లకు భారీ లీడ్.!

తెలుగుదేశం పార్టీకి ఉన్న కంచుకోటల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తెనాలి కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇక్కడ టి‌డి‌పి అయిదుసార్లు వరకు గెలిచింది. 1983, 1985, 1994, 1999, 2014 ఎన్నికల్లో అక్కడ టి‌డి‌పి గెలిచింది. 1989, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. అయితే 1989, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ వేవ్ ఎక్కువ ఉండటంతో సత్తా చాటింది.

2009లో ప్రజారాజ్యం, 2019 ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడంతో అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ గెలిచిందని చెప్పవచ్చు. 2009 విషయం పక్కన పెడితే..2019 ఎన్నికలకు వస్తే..అక్కడ టీడీపీ అభ్యర్ధి ఆలపాటి రాజాపై వైసీపీ అభ్యర్ధి శివకుమార్ 17 వేల ఓట్ల పైనే మెజారిటీతో గెలిచారు. అదే సమయంలో జనసేన నుంచి పోటీ చేసిన నాదెండ్ల మనోహర్‌కు 30 వేల ఓట్లు వరకు పడ్డాయి. అంటే అక్కడ టి‌డి‌పి-జనసేన కలిసి పోటీ చేసి ఉంటే వైసీపీ గెలిచేది కాదనే చెప్పాలి. అయితే ఈ సారి ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన కలిసి పోటీ చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే.

పొత్తు ఉంటే జనసేనకు కొన్ని సీట్లు కేటాయించాలి..ఈ క్రమంలోనే తెనాలి సీటు జనసేనకు ఇస్తారనే ప్రచారం ఉంది. పైగా తనకు ఏ సీటు గ్యారెంటీ లేదని, చంద్రబాబు ఏం చెబితే అది చేస్తానని, ఆయనే తనని చూసుకుంటారని ఆలపాటి రాజా ఆ మధ్య కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

దీంతో తెనాలి సీటు జనసేనకు ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. నాదెండ్ల మనోహర్ అక్కడ పోటీ చేయనున్నారు. ఇక టి‌డి‌పి మద్ధతు ఉంటుంది కాబట్టి..ఈ సారి ఎన్నికల్లో నాదెండ్ల భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది.

Exit mobile version