ఎట్టకేలకు బద్వేలు ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల అయింది. గత వేసవిలో బద్వేలు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మరణించారు. అయితే కరోనా నేపథ్యంలో ఇంతవరకు ఎన్నిక జరగలేదు. తాజాగా ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ విడుదల అయింది. అక్టోబర్ 30న ఎన్నిక, నవంబర్ 2న ఫలితం విడుదల అవుతుంది. అయితే ఈ ఎన్నికలో వైసీపీకి వన్ సైడ్‌గా విజయం దక్కనుందని తెలుస్తోంది.

ఇదే అంశాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెబుతున్నారు. బద్వేల్ ఉప ఎన్నికలో డాక్టర్ వెంకట సుబ్బయ్య భార్య డాక్టర్ దాసరి సుధ వైసీపీ అభ్యర్ధిగా బరిలో దిగుతారని చెప్పారు. జగన్ మీద ప్రజల్లో అభిమానం తగ్గడానికి ఎలాంటి అవకాశం లేకపోగా.. మరింతగా పెరిగిందనడానికి 2019 నుంచి ఇప్పటివరకూ జరిగిన వరుస ఎన్నికల ఫలితాలే నిదర్శనమని, బద్వేలులో భారీ మెజారిటీతో గెలుస్తామని చెప్పారు.

ఈ క్రమంలోనే టిడిపి హయాంలో జరిగిన నంద్యాల ఉపఎన్నిక గురించి సజ్జల మాట్లాడారు. గతంలో నంద్యాల ఉప ఎన్నికప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు భయోత్పాతం సృష్టించి.. డబ్బుల్ని వెదజల్లారని.. పథకాలు ఆగిపోతాయని ప్రజలని బెదిరించి గెలిచారని అన్నారు. ఇప్పుడూ అలాగే చేస్తే వారి ఆగడాలను అడ్డుకుంటామని సజ్జల చెప్పారు. అయితే నంద్యాల ఉపఎన్నికలో ఎవరు హడావిడి చేశారో అందరికీ తెలుసని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు.

చంద్రబాబుపై జగన్ ఎలాంటి మాటలు మాట్లాడి. భయానక వాతావరణం సృష్టించారో కూడా తెలుసని చెబుతున్నారు. ఇక డబ్బులు పంచడం, భయోత్పాతం సృష్టించడం, పథకాలు ఆగిపోతాయని ప్రజలని బెదిరించడం గురించి సజ్జల చెబుతుంటే కామెడీగా ఉందని అంటున్నారు. 2019 ఎన్నికల తర్వాత నుంచి వైసీపీ చేసేవి అన్నీ సజ్జల చక్కగా ఒప్పుకున్నారని, ప్రతిపక్షాలపై దాడులు చేసి నామినేషన్స్ వేయనివ్వకుండా చేయడం, ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు చేయడం, ఓటు వేయకపోతే పథకాలు ఆగిపోతాయని బెదిరించడం లాంటి కార్యక్రమాలు వైసీపీ వాళ్ళు చక్కగా చేశారని గుర్తుచేస్తున్నారు.

Discussion about this post