ఏపీ మంత్రి వర్గ పునర్ వ్యవస్తీకరణ పూర్తయింది. దీనిలో చోటు దక్కించుకునేందుకు అనేక మంది సీని యర్లు ప్రయత్నించి విఫలమయ్యారు. నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వారు పదవులు దక్కించు కున్నారు. అయితే.. ఈ పరిణామం.. సహజంగానే సీనియర్లను బాధించింది. ఇలాంటి వారిలో ఉమ్మడి కృష్ణాజిల్లా , ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను ఒకరు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈయన.. మంత్రి వర్గంలో చోటు కోసం.. చివరి నిముషం వరకు కూడా ఆశలు పెట్టుకున్నారు.. పెంచుకున్నారు. కానీ, దక్కలేదు.
దీంతో బాహాటంగానే ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను సీనియర్‌నని.. పార్టీలోను.. ప్రజల్లో నూ బలం ఉందని.. మంత్రి అయ్యేందుకు.. తనకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. అయినప్పటికీ .. మంత్రి పదవి దక్కక పోవడం వెనుక.. జిల్లాకు చెందిన ఒక కోటరీ.. బలంగా ప్రభావం చూపిందని ఆయ న ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ప్రజల్లో ఉండకుండా.. ముఖ్యమంత్రి చుట్టూ తిరిగి.. తనపై ఫిర్యాదు లు మోసారని.. అందుకే తనకు పదకి దక్కకుండా పోయి ఉంటుందని తెలిపారు. తన అనుచరులు.. అభిమానులు బాధపడుతున్నారని అన్నారు.
అయితే.. సామినేని చెప్పిన ఈ విషయాలు ఎలా ఉన్నప్పటికీ.. ఆయన రాజకీయాలను దగ్గరగా చూస్తున్న కొందరు.. సామినేనికి పదవి రాకపోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. వాటి వల్లే.. ఆయనకు పదవి రాకుండా పోయి ఉంటుందని.. చెప్పుకొస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సామినేని కుమారుడు.. ప్రయాణిస్తున్న కారులో గంజాయి లభించడం.. ఏడాది కిందట తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై సవాళ్లు ప్రతిసవాళ్లు కూడా జరిగాయి. ఏకంగా టీడీపీ నాయకులు.. హైదరాబాద్‌కు చేరుకుని అక్కడే చర్చకు పట్టుబట్టారు. అయితే.. ఆ విషయంలో సామినేని.. పెద్దగా రియాక్ట్ కాలేదు.
ఇక, హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసుపై.. సామినేని కుమారుడు దురుసుగా ప్రవర్తించడం.. అక్కడ కేసు కూడా నమోదు కావడం.. అప్పట్లలోనే సంచలనం సృష్టించింది. ఇది తర్వాత.. మధ్యవర్తిత్వం ద్వారా సమసి పోయింది. అదే సమయంలో తనపై ఉన్న కేసుల విషయంలోనూ.. సామినేని దూకుడుగా వ్యవహరించి.. వాటిని కొట్టేయించుకున్నారు. దాదాపు 8 వరకు కేసులను ఆయన తీసివేయించుకున్నారు. ఇది ఒకరకంగా.. ఆయనకు లబ్ధి చేకూర్చి పెట్టినట్టయింది. అంటే.. పార్టీ అధికారంలో ఉంది కనుక.. ఆయనకు మేలు జరిగినట్టుగానే సీఎం జగన్ భావించి ఉంటారని పరిశీలకులుచెబుతున్నారు.
ఇక, దీనికితోడు.. సీఎం జగన్ చేయించిన సర్వేలో.. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారు.. అని నిర్దారించుకున్న వారికి కూడా ప్రస్తుత మంత్రి వర్గంలో చోటు లభించలేదు. వీరిలో సామినేని కూడా ఉన్నారని.. తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలను గమనిస్తే.. ఆయనకు భవిష్యత్తులోనూ.. మంత్రి వర్గంలో చోటు దక్కడం కష్టమేనని అంటున్నారు. పైగా ఇప్పుడు ఆయన వయసు 66 ఏళ్లు.. కాబట్టి.. రేపు వైసీపీ ప్రభుత్వం మళ్లీ వచ్చినా.. వయసు రీత్యా ఆయనను పక్కన పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదిలావుంటే.. సామినేని జగ్గయ్య పేట నుంచి మూడు సార్లు విజయం దక్కించుకున్నారు.
కాంగ్రెస్ తరఫున రెండు సార్లు గెలిచారు. అప్పట్లోనూ ఆయన మంత్రి వర్గంలో చోటు కోసం ప్రయత్నాలు చేశారు. అయితే.. అప్పట్లోనూ.. ఆయనకు లభించలేదు. ఈ క్రమంలోనే విప్ ఇచ్చి సంతృప్తి పరిచారు. తర్వాత.. 2019లో జగన్ సునామీలో మరో సారి వైసీపీ తరఫున విజయం సాధించారు. ఇప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం ఆయనకు విప్ ఇచ్చింది. దీంతో సామినేని గెలుపు గుర్రం ఎక్కినా.. మంత్రి అయ్యే యోగం లేదని.. ఆయన అభిమానులే చర్చించుకోవడం గమనార్హం.
Discussion about this post