సాధారణంగా.. పార్లమెంటు సభ్యుడు.. ఎంపీ అంటే.. ఏం చేస్తారు? తన నియోజకవర్గంలోని ప్రజలకు అవసరమైన మౌలిక సదు పాయాల కల్పన, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పథకాలను తీసుకువచ్చేందుకు బలమైన గళం వినిపించడం.. అదేసమయంలో కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తన నియోజక వర్గంలోనూ తూ.చ తప్పకుండా అమలయ్యే లా చూడడం ఇవీ.. సాధారణంగా ఏ ఎంపీకైనా.. ఉండే విధులు. అయితే.. అధికార పార్టీ వైసీపీకి ఉన్న 22మంది ఎంపీల్లో తలకొక రకంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఆది నుంచి ఉన్నాయి.

ఒకరు సొంత ఆస్తులు పోగేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని .. కొన్నాళ్ల కిందట పార్టీలోనే తీవ్ర దుమారం రేగింది. ఇక, మరికొందరు ఎంపీలు.. ఆధిపత్య రాజకీయాలు చేస్తున్నారనే విషయం కళ్లముందు కనిపించిందికూడా. ఇక, ఇంకొందరు అవకాశం వచ్చింది కదా.. అనుకొని ఢిల్లీలోనే పాగావేసి.. అక్కడే వ్యాపారాలు వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. మరికొందరు.. తమకు సంబంధం లేని నియోజకవర్గాల్లో వేలు పెట్టి.. వివాదాలకు కేంద్రంగా మారారని కూడా విన్నాం. ఇలాంటి వారికి బిన్నంగా.. మరొక యువ ఎంపీ వ్యవహరిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.

ఈ ఎంపీ స్టయిలే వేరని అంటున్నారు. ఈయన పెద్ద పెద్ద సెటిల్మెంట్ల జోలికి వెళ్లరు. చిన్న చిన్న వివాదాలు.. చిన్నపాటి సెటిల్మెంట్లు అంటే.. ముద్దట. దీనివల్ల.. పార్టీ కేడర్‌లో తనకు ఎనలేని గుర్తింపు వస్తుందని కూడా చెప్పుకొంటున్నారు. ఆయనే.. బాపట్ల ఎంపీ నందిగం సురేష్. ఆయన ఎంపీగా ఎన్నికయ్యాక.. ఇది నేను చేశాను.. అని చెప్పుకొనే ప్రతిష్టాత్మక కార్యక్రమం కానీ.. ఇది నేనే తెచ్చాను.. అని చెప్పుకొనే ప్రాజెక్టు కానీ.. లేవు. కానీ. సైకిల్ వివాదాల నుంచి మంచి నీళ్ల దగ్గర మహిళ వివాదాల వరకు పరిష్కరించి.. నేనే చేశాను.. అని చెప్పుకొంటున్నారని వైసీపీలో వ్యంగ్యాస్త్రాలు వస్తున్నాయి.

గతంలో కొందరు యువకులు విజయవాడలో సినిమా చూసి అర్ధరాత్రి వెళ్తూ వెళ్తూ.. వేసిన వీరంగాన్ని పోలీసులు అడ్డుకు న్నారు. ఇంకేముంది.. వెంటనే ఎక్కడో బాపట్లలో ఉన్న ఎంపీగారు రయ్యన కృష్ణ లంక వచ్చి `సెటిల్మెంట్` చేశారు. ఇలానే.. నియోజకవర్గంలో నోపార్కింగ్‌లో బండి పెట్టారని.. పోలీసులు కేసులు రాస్తే.. వాటిని బలంగా పోరాడి రద్దు చేయించారని వైసీపీలోనే టాక్ వినిపించింది. ఇక, తాజాగా.. రాజధాని ప్రాంతమైన రాయపూడిలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా తాడికొండకు చెందిన ఓ వ్యక్తి బైక్‌ను ఆపి తనిఖీచేయబోయారు. దీంతో ఆయన నేను ఎంపీ నందిగం సురేష్ తాలూకు మనిషినని చెప్పాడు. అయినా.. పత్రాలు చూపించాలని కానిస్టేబుల్ పట్టుబట్టారు. దీంతో వెంటనే సదరు యువకుడు ఎంపీ ఫోన్ కొట్టగానే ఆయ న లైన్‌లోకి వచ్చేసి.. దీనిని కూడా సెటిల్ చేశారు. కానీ, ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఇదే బాపట్లలో తమకు నీరు అందడం లేదు మొర్రో అంటూ.. కొన్ని గ్రామాల ప్రజలు బాధపడుతున్నారు. కానీ, వారికి మాత్రం ఎంపీ ఫోన్ అందడం లేదు..

ఎప్పుడు చేసినా బిజీ అని వస్తోందట. కానీ.. ఈ చిల్లర సెటిల్మెంట్ల విషయంలో మాత్రం పోన్ 24/7 పనిచేస్తోందని.. వైసీపీ నేతలే పెదవి విరుస్తున్నారు. అందుకే.. ఈ సెటిల్మెంట్ల ఎంపీపై ఒక కన్నేయండి సార్ అని జగన్‌ను వేడుకుంటున్నారు. ఇప్పటికైనా.. ప్రజలకు ఉపయోగపడే పనిచేస్తూ.. ఎన్ని సెటిల్మెంట్లయినా.. చేసుకోమనండిఅంటున్నారు. మరి ఎంపీగారు మారతారో లేదో చూడాలి.

Discussion about this post