తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న యనమల రామకృష్ణుడు వచ్చే ఎన్నికల్లో తమ ఫ్యామిలీకి సీటు దక్కదని పరోక్షంగా డిసైడ్ అయినట్లు కనిపిస్తున్నారు. తాజాగా ఆయనకు యువకులకే ఎక్కువ సీట్లు కేటాయించాలని చంద్రబాబుతో తానే మాట్లాడనని, అందుకు ఆయన ఒప్పుకున్నారని యనమల చెప్పుకొచ్చారు. అంటే పరోక్షంగా తమ సీటు తుని కూడా యువ నేతలకు ఇవ్వాలని చెప్పినట్లు అర్ధమవుతుంది.

ఎలాగో అక్కడ యనమల ఫ్యామిలీ సీన్ అయిపోయింది. మళ్ళీ పోటీకి దిగితే గెలిచే అవకాశాలు కూడా కనిపించడం లేదని సర్వేలు చెబుతున్నాయి. 1983 నుంచి 2004 వరకు యనమల వరుసగా తునిలో ఆరుసార్లు గెలిచారు. 2009లో ఓడిపోయారు. 2014, 2019 ఎన్నికల్లో యనమల సోదరుడు కృష్ణుడు పోటీ చేసి ఓడిపోయారు. ఇక వచ్చే ఎన్నికల్లో మళ్ళీ సీటు ఇస్తే గెలుపు అవకాశాలు తక్కువ ఉన్నాయని, అసలు యనమల ఫ్యామిలీకి సీటు ఇవ్వవద్దని సొంత పార్టీ నుంచే డిమాండ్ వినిపిస్తోంది.

ఈ పరిస్తితుల నేపథ్యంలో చంద్రబాబు సైతం తుని సీటు విషయంలో యనమల ఫ్యామిలీని పక్కన పెడతారని టాక్ నడుస్తోంది. ఇక బాబు చెప్పడం ఎందుకని యనమల యువతకే ప్రాధాన్యత ఇస్తామని పరోక్షంగా తుని సీటు వేరే వాళ్ళకు ఇస్తారని హింట్ ఇచ్చినట్లు అయింది. అయితే సీటులో తన కుమార్తె దివ్యని పోటీకి దింపాలని యనమల చూస్తున్నట్లు తెలిసింది.

అసలు యనమల ఫ్యామిలీ ఊసు లేకుండా తునిలో కొత్తవారిని బరిలో దించాలనే వాదన వస్తుంది. కాపు లేదా శెట్టిబలిజ వర్గానికి సీటు ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తోంది. అటు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు సైతం తుని సీటు కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి చంద్రబాబు తుని సీటు ఎవరికి ఇస్తారో చూడాలి.
