May 31, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

మాడుగులలో తమ్ముళ్ళ పోరు..మళ్ళీ పోగొడతారా?

ఒకప్పుడు టి‌డి‌పికి కంచుకోటలుగా ఉన్న స్థానాల్లో ఇప్పుడు వైసీపీ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొన్ని స్థానాలని వైసీపీ వరుసగా కైవసం చేసుకుంది. ఒకప్పుడు టి‌డి‌పిని ఆదరించిన వారే వైసీపీ వైపుకు వచ్చేశారు. దీని వల్ల టి‌డి‌పికి ఛాన్స్ దొరకడం లేదు. పైగా కొన్ని స్థానాల్లో టి‌డి‌పిలో వర్గపోరు ఎక్కువ నడుస్తోంది. దీని వల్ల వైసీపీకి మరింత అడ్వాంటేజ్ అవుతుంది.

అలా టి‌డి‌పిలో రచ్చ నడుస్తున్న స్థానాల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలోని మాడుగుల ఒకటి. అసలు ఈ స్థానం టి‌డి‌పి కంచుకోట..1983 నుంచి 1999 వరకు వరుసగా అయిదుసార్లు టి‌డి‌పి గెలిచింది. 2004లో ఓడిపోయిన 2009లో మళ్ళీ గెలిచింది. అలా ఆరు సార్లు గెలిచిన టి‌డి‌పి  గత రెండు ఎన్నికల నుంచి విజయం కోసం తహతహలాడుతుంది. వరుసగా ఇక్కడ వైసీపీ పై చేయి సాధిస్తుంది. 2014లో కేవలం 4 వేల ఓట్లతో గెలిచిన వైసీపీ..2019 ఎన్నికల్లో 16 వేల ఓట్ల తేడాతో గెలిచింది.

వైసీపీ నుంచి బూడి ముత్యాలనాయుడు వరుసగా గెలుస్తున్నారు. టి‌డి‌పి నుంచి గవిరెడ్డి రామానాయుడు వరుసగా ఓడిపోతున్నారు. 2009లో ఈయనే టి‌డి‌పి నుంచి గెలిచారు. అయితే రామానాయుడుపై సొంత పార్టీ నేతలే  కొందరు వ్యతిరేకతతో ఉన్నారు. దీంతో చంద్రబాబు..రామానాయుడుని పక్కన పెట్టి పీవీజీ కుమార్‌ని ఇంచార్జ్ గా పెట్టారు. అయితే కుమార్ ఇంచార్జ్ గా దూకుడుగానే పనిచేస్తున్నారు. మళ్ళీ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. కానీ ఈయనతో రామానాయుడు కలవడం లేదు. ఎవరికి వారే సెపరేట్ అన్నట్లు ఉన్నారు. దీని వల్ల టి‌డి‌పి రెండుగా చీలింది.

ఎన్నికల వరకు ఇదే పరిస్తితి ఉంటే..మళ్ళీ మాడుగులలో వైసీపీ గెలవడం ఖాయం. కాకపోతే మాడుగులలో ఉన్న మంత్రి ముత్యాలనాయుడుకు పెద్ద పాజిటివ్ లేదు. కానీ టి‌డి‌పిలో ఉన్న విభేదాలే మంత్రికి ప్లస్. అలా కాకుండా టి‌డి‌పి నేతలు కలిసికట్టుగా పనిచేస్తే మాడుగులని సొంతం చేసుకోవచ్చు..లేదంటే మళ్ళీ గెలవడం కష్టమే.