ఏపీ రాజకీయాల్లో ఇప్పుడుప్పుడే మార్పు మొదలైనట్లు కనిపిస్తోంది. మామూలుగా ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు రాజకీయం మార్పు ఉంటుంది. అధికార పార్టీపై వ్యతిరేకత అప్పుడే కనిపిస్తోంది. కానీ ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు అయింది అంతే..ఇక ఈలోపే ఏపీలో మార్పు స్పష్టంగా తెలుస్తోంది. పూర్తిగా వైసీపీ ఆధిక్యం తగ్గకపోయినా..టీడీపీ మాత్రం పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కొన్ని జిల్లాలో మార్పు బాగానే తెలుస్తుంది.

అసలు టీడీపీ కంచుకోటగా ఉన్న శ్రీకాకుళంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో సిక్కోలులో వైసీపీ ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే. జిల్లాలో 10 సీట్లు ఉంటే వైసీపీ 8 సీట్లు గెలుచుకుంది. టీడీపీకి రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఈ రెండున్నర ఏళ్లలో జిల్లాలో చాలా మార్పులు వచ్చాయి. వైసీపీకి వ్యతిరేక గాలులు వీయడం మొదలయ్యాయి. పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనబడుతోంది.

ఇటీవల వెలువడిన మినీ పరిషత్ ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ మంచి విజయాలే సాధించింది. పాతపట్నంలో ఒక జెడ్పీటీసీ స్థానంలో ఏకంగా ఎమ్మెల్యే వారసుడుని టీడీపీ ఓడించింది. హీరమండలం జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమారుడు వైసీపీ నుంచి పోటీ చేశారు. కానీ టీడీపీ నుంచి ఒక సామాన్య కార్యకర్త పోటీ చేసి…వైసీపీని ఓడించారు. అటు ఆమదాలవలస నియోజకవర్గంలో కూడా మార్పు తెలుస్తోంది. స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో టీడీపీ ఆధిక్యం మొదలైంది. నియోజకవర్గంలో టీడీపీ వేగంగానే పుంజుకుంటుంది.

అటు రాజాం నియోజకవర్గంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ నేత కొండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో వేలమంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఇలా ఒకో నియోజకవర్గంపై టీడీపీ పట్టు సాధిస్తుంది. ఇప్పటికే సగంపైనే నియోజకవర్గాల్లో టీడీపీ పట్టు దక్కించుకున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికైతే సిక్కోలులో సైకిల్ స్పీడ్ పెరిగిందని చెప్పొచ్చు.

Discussion about this post