కరణం బలరాం నాలుగు దశాబ్దాలుగా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న నేత. కరణం సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికే నాలుగైదు పార్టీలు మారారు. మూడు నాలుగు నియోజకవర్గాలు మారారు. ఆయన ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీకి మాత్రం ఎప్పుడూ తలపోటు తప్పటం లేదు. గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆయనపై కేసులు నమోదు కావడంతో కాంగ్రెస్ లోకి వెళ్లి రక్షణ పొందారు. తిరిగి టిడిపిలోకి రీ ఎంట్రీ ఇచ్చాక అద్దంకి నియోజకవర్గంలో ఎప్పుడు రాజకీయంగా ఏదో కలవరం రేపుతూనే ఉన్నారు. ఇక గత ఎన్నికల్లో చీరాలలో గెలిచిన కరణం ఇప్పుడు వైసిపి చెంత చేరారు. ఇప్పుడు కరణం తీరుతో చీరాల వైసీపీలో రోజుకో రగడ తప్పటం లేదు.

గత ఎన్నికల్లో చీరాల నుంచి టిడిపి తరఫున గెలిచిన కరణం అధికార పార్టీతో అంటకాగుతూ తన పనులు చక్కబెట్టేందుకే ఆ పార్టీ చెంత చేరారు అన్న టాక్ ఉంది. ఇప్పుడు కరణం వైసీపీలో మనస్ఫూర్తిగా ఉన్నారా ? అంటే చాలా సందేహాలు కలుగుతున్నాయి. కరణం పేరుకు మాత్రమే వైసీపీ చెంత ఉన్నట్టు ఉన్నా.. ఆయన ఎన్నికల టైంలో అదను చూసుకుని ఆ పార్టీకి షాక్ ఇస్తారన్న సందేహాలు ఆ పార్టీ వాళ్లకే ఉన్నాయి. ఇదిలా ఉంటే టీడీపీ నుంచి గెలిచి వైసీపీ చెంత చేరిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు కచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి తిరిగి టిడిపి చెంత చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ లిస్టులో విశాఖ ఎమ్మెల్యే గణేష్ కుమార్ తో పాటు కరణం బలరాం పేరు కూడా వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు ఇటీవల రాష్ట్రంలో ఉన్న టిడిపి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్‌లతో అమరావతిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ – ఏలూరి సాంబశివరావు – దామచర్ల జనార్ధన్ సమన్వయంతో పార్టీని ముందుకు నడిపిస్తూ జిల్లాలో పార్టీ బలోపేతం అయ్యేందుకు కృషి చేశారని ప్రత్యేకంగా ప్రశంసించారు. దీంతో పాటు ఈ విషయంలో ప్రకాశం జిల్లా నేతలను రాష్ట్రంలో ఉన్న మిగిలిన జిల్లాల నేతలు అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

కరణం వస్తే పార్టీ పాతాళంలోకే…!
ఈ క్రమంలోనే జిల్లాకు చెందిన కొందరు టిడిపి నేతలు బలరాం పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడం తోనే తామంతా సమన్వయంతో కలిసి పని చేయడంతో పాటు… అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీని బలోపేతం చేస్తున్నామని… బలరాం పార్టీలో ఉన్నన్ని రోజులు తమలో తమకు కలహాలు సృష్టిస్తూ పబ్బం గడుపుకున్నారని వారు నేరుగానే చంద్రబాబుకు చెప్పినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ” సార్ ఆయన గురించి మేము మీకు ఉదాహరణలతో చెప్పాల్సిన అవసరం లేదు… అద్దంకి అయినా, ఒంగోలు అయినా … మరో నియోజకవర్గం అయినా ఎలాంటి ఇబ్బందులు పెట్టారో మీరు చూశారు.. ఇప్పుడు మళ్లీ ఆయన తిరిగి పార్టీలోకి వస్తారని ప్రచారం జరుగుతోంది… మరోసారి మీరు ఆయన పార్టీలోకి తీసుకుని తప్పు చేయవద్దని ” కూడా బాబుకు నేరుగా చెప్పినట్టు తెలిసింది.

ఒకరిద్దరు నేతలు అయితే మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు పేరు కూడా ప్రస్తావిస్తూ… ఆయనకు కూడా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాగా ప్రయారిటీ ఇచ్చామని… పార్టీ ఓడిపోయిన వెంటనే ఆయన కూడా కండువా మార్చేశారని… శిద్ధాను కూడా తిరిగి పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పేశారట. అయితే ఎక్కువ మంది నేతలు మాత్రం బలరాం విషయంలో బాగా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బలరాం తిరిగి టీడీపీలోకి వస్తే జిల్లా టిడిపి మళ్లీ పాతాళంలోకి వెళ్లి పోతుంది అని కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారట. వారి మాటలు విన్న చంద్రబాబు అలాంటి తప్పు చేయనని వారికి హామీ ఇచ్చినట్టుగా తెలిసింది. ఏదేమైనా ప్రకాశం జిల్లా టీడీపీ కీలక నేతలు అందరూ బలరాం విషయంలో ఎంత వ్యతిరేక భావంతో ఉన్నారో స్పష్టంగా తెలుస్తోంది.

Discussion about this post