ఓడిన చోటే గెలిచి తీరాలనే కసితో టిడిపి నేతలు ఉన్నారు. గత ఎన్నికల్లో జగన్ గాలిలో టిడిపిలో సీనియర్లు లేరు..జూనియర్లు లేరు అంతా దారుణంగా ఓడిపోయారు. అలా ఓటమి పాలైన వారు ఈ సారి వైసీపీపై రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే టిడిపి వారసులు మంచి కసి మీద ఉన్నారు. గత ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసి వారసులు మొత్తం ఓటమి పాలయ్యారు. ఒక్కరూ కూడా గెలవలేదు.
కానీ ఈ సారి ఖచ్చితంగా గెలవాలనే దిశగా యువ నేతలు పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు వారసులు గెలుపు బాటలో వెళుతున్నారు. అలా గెలుపు బాటలో మొదట ఉన్న వారసుడు టిడిపి అధినేత చంద్రబాబు వారసుడు నారా లోకేష్..గత ఎన్నికల్లో అనూహ్యంగా మంగళగిరిలో లోకేష్ ఓడిపోయారు. కానీ ఈ సారి అక్కడ లోకేష్ పక్కాగా గెలవడం ఖాయమని చెప్పవచ్చు. ఇటు పెడనలో కాగిత వెంకట్రావు వారసుడు కాగిత కృష్ణప్రసాద్ ఓటమి పాలయ్యారు. ఇప్పుడు అక్కడ కాగిత వారసుడు గెలుపు దిశగా వెళుతున్నారు.

అటు బాలయోగి వారసుడు హరీష్ సైతం ఈ సారి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. గత ఎన్నికల్లో హరీష్..అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి పి.గన్నవరం స్థానంలో పోటీ చేసి గెలవాలని చూస్తున్నారు. ఇక పలాసలో గౌతు లచ్చన్న మనవరాలు గౌతు శిరీష పోటీ చేసి గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ సారి ఆమె కూడా గెలుపు దిశగా వెళుతున్నారు.
ఇటు విశాఖలో బాలయ్య చిన్నల్లుడు భరత్ సైతం గెలుపు వైపు పయనిస్తున్నారు. అలాగే శ్రీకాళహస్తిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వారసుడు సుధీర్ రెడ్డి రేసులో ఉన్నారు. ఇక ధర్మవరంలో పరిటాల శ్రీరామ్‌కు గెలుపు అవకాశాలు ఉన్నాయి. కాకపోతే శ్రీరామ్ ఇంకా కష్టపడాలి. అయితే ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డిలకు కాస్త గెలుపు ఛాన్స్ తక్కువగా ఉంది.