వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేనల పొత్తుపై క్లారిటీ వస్తున్నట్లే కనిపిస్తుంది…కానీ ఒకోసారి క్లారిటీ మిస్ అవుతుంది. రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? లేదా? అనేది ఎన్నికల ముందే స్పష్టమైన ప్రకటన వచ్చేలా ఉంది. అయితే దాదాపు పొత్తు ఉండవచ్చు అనే ప్రచారం ఉంది. పొత్తులో భాగంగా కొన్ని సీట్లని జనసేనకు వదలడానికి టిడిపి కూడా సిద్ధమైందని తెలుస్తోంది. ఇదే క్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం సీట్లు జనసేనకే ఇస్తారని ప్రచారం ఉంది.

అందుకే అక్కడ తాత్కాలిక ఇంచార్జ్‌లని పెట్టారనే టాక్ ఉంది. అంటే పక్కాగా ఆ సీట్లు జనసేనకు దక్కుతాయని అంటున్నారు. కానీ తాజాగా తాడేపల్లిగూడెంలో కొత్త ట్విస్ట్ వచ్చినట్లు కనిపిస్తుంది. మొన్నటివరకు ఈ సీటు జనసేనకే అని ప్రచారం జరిగింది..కానీ ఇటీవల ఆ సీటు టీడీపీకే దక్కుతుందని ప్రచారం మొదలైంది. తాడేపల్లిగూడెంలో మొదట నుంచి టిడిపికి పట్టు ఉంది. 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఈ సీటు బిజేపికి ఇచ్చారు.

2019 ఎన్నికల్లో టిడిపి నుంచి ఈలి నాని పోటీ చేసి ఓడిపోయి, ఆ తర్వాత పార్టీకి దూరమయ్యారు. దీంతో వలవల మల్లిఖార్జున రావు(బాబ్జీ)ని ఇంచార్జ్ పెట్టారు. ఈయన ఇంచార్జ్‌గా వచ్చిన దగ్గర నుంచి టిడిపిలో దూకుడు పెరిగింది. పార్టీ కార్యక్రమాలు చురుగ్గా చేపట్టి.. పార్టీ బలం పెంచారని తెలిసింది. దాంతో పలుమార్లు పార్టీ అగ్రనేతలు చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు ఆయన్ను పిలిచి, నియోజకవర్గంలో పరిస్థితిని అడిగి తెలుసుకోవడమే కాకుండా, వారి దగ్గరున్న సర్వే రిపోర్టులతో సరిపోల్చుకుని, అన్ని పరిణామాలు అనుకూలంగా ఉండడంతో వలవల బాబ్జీని ఎన్నికలకు రెడీగా ఉండాలని సూచించారట. అంటే పొత్తు ఉన్న ఈ సీటు టీడీపీకే దక్కుతుందని అంటున్నారట. చూడాలి మరి చివరికి ఈ సీటు ఎవరికి దక్కుతుందో.
