జనసేన అధినేత పవన్ కల్యాణ్..వారాహి యాత్ర చేస్తూ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. అలాగే జనసేనని బలోపేతం చేసుకునే దిశగా తీసుకెళుతున్నారు. ఇక తనని తిట్టే వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఇదే క్రమంలో తాజాగా కాకినాడ సభలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టార్గెట్ గా పవన్ ఫైర్ అయ్యారు. ద్వారంపూడి ఒక డెకాయిట్ అంటూ విరుచుకుపడ్డారు.
“ ద్వారంపూడి నువ్వో డెకాయిట్.. కాకినాడను నువ్వు డ్రగ్స్ డెన్‌గా మార్చావు.. నువ్వు ఎలా గెలుస్తావో చూస్తా.. నీ నేర సామ్రాజ్యం నేలకూలుస్తా. నీకు రోజులు దగ్గర పడ్డాయి జాగ్రత్త” అంటూ పవన్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ద్వారంపూడిని, సీఎం జగన్‌ని రోడ్డుకీడ్చుతానని అన్నారు. ఈ నాలుగేళ్లలో ద్వారంపూడి కుటుంబం అక్రమ సంపాదన రూ.15వేల కోట్లు అని, ఎక్కడైనా స్థలం కనిపిస్తే చాలు కబ్జాలకు పాల్పడుతున్నారని, అడ్డొచ్చిన వారిపై దౌర్జన్యాలు, గంజాయి సరఫరా, బియ్యం వ్యాపారంతో సంపాదించిన అక్రమార్జనతో బలిసి ఉన్నాడని అన్నారు.
జనసేన అధికారంలోకి వస్తే ఎమ్మెల్యే తాతను బేడీలు వేసి జైలుకి పంపించిన అప్పటి ఎస్పీ డీటీ నాయక్‌లా తాను బీమ్లా నాయక్ ట్రీట్మెంట్ చూపిస్తానని అన్నారు. ఈ రేంజ్ లో ద్వారంపూడిపై పవన్ ఫైర్ అవ్వడానికి కారణాలు ఉన్నాయి. గతంలో అకారణంగా ద్వారంపూడి..పవన్‌ని వ్యక్తిగతంగా బూతులు తిట్టారు. అటు చంద్రబాబుని దారుణంగా తిట్టారు. అసెంబ్లీలో ఆయన భార్యని కించపరిచారు.
ఇక నిరసన తెలియజేస్తున్న జనసేన శ్రేణులపై ద్వారంపూడి అనుచరులు దాడులు చేశారు. అందుకే పవన్..ద్వారంపూడిని గట్టిగా టార్గెట్ చేశారు. అయితే ద్వారంపూడిని ఓడించాలంటే పవన్‌కు టిడిపి సపోర్ట్ కావాలి. కాకినాడ సిటీలో జనసేన కంటే టిడిపి బలం ఎక్కువ. గత ఎన్నికల్లో ద్వారంపూడికి 73 వేల ఓట్లు వస్తే, టిడిపికి 60 వేలు, జనసేనకు 30 వేలు ఓట్లు వచ్చాయి. టిడిపి, జనసేన కలిస్తే ద్వారంపూడికి చెక్ పడుతుంది.