మరో నాలుగు రోజుల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ 40వ వసంతంలోకి అడుగులు వేస్తోంది. సుదీర్ఘ రాజకీయ ప్రస్తానంలో అనేక మెరుపులు ఈ పార్టీకి సొంతం. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన ఈ పార్టీ.. పార్టీ పెట్టిన వెంటనే అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీగా గుర్తింపు పొందింది. అంతేకాదు.. పేదల పక్షాన… ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకోవడం లోనూ.. పార్టీ అత్యంత వేగంగా పనిచేసింది. దీంతో ఆయా వర్గాలు ఈ పార్టీకి క్షేత్రస్థాయిలో పునాదులు బలపరిచారనే చెప్పాలి.

రెండు రూపాయల కిలోబియ్యం పథకంంతో ప్రతి పేద ఇంటి తలుపు తట్టిన పార్టీగా.. టీడీపీ నేటికి హిస్టరీని సొంతం చేసుకుంది. అది అన్నగారి కాలంలో సంక్షేమానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చిన పరిస్థితి. అయితే..అన్నగారి హయాం తర్వాత.. చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత.. ఒక దశకం మొత్తం.. పార్టీ ఉజ్వలమైన భవితను సొంతం చేసుకుంది. ఇటు రాష్ట్రంలో(ఉమ్మడి), అటు జాతీయ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించింది.

వాస్తవానికి అన్నగారు ఉన్నప్పుడే.. నేషనల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పినప్పటికీ.. చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత.. టీడీపీ జాతకమే మారిపోయిందా? అనే రేంజ్‌లో పుంజుకుంది. కేంద్రంలోనూ.. రాష్ట్రంలోనూ అప్రతిహత దూకుడు ప్రదర్శించింది. ప్రధాని నుంచి రాష్ట్ర పతుల వరకు అనేక మంది కీలక నేతల ఎంపికలోనూ.. పొత్తులతోనూ.. పార్టీ ఒక ప్రభంజన శకాన్ని చవి చూసింది.

అంతేకాదు.. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా రూపొందించడంలో టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు చూపిన తెగువ అనన్య సామాన్యం. అదేవిధంగా సైబరాబాద్‌ను నిర్మించారు. ఇక, అన్ని సామాజిక వర్గాలకు కూడా పార్టీని చేరువ చేయడంలో బాబు చూపిన ఉత్సాహం.. ప్రతి విధానంలోనూ.. ప్రతి నిర్ణయంలోనూ.. ఆయన అన్ని వర్గాలను చేరువ చేశారు. పార్టీకి అందరూ కావాలి.. ఈ పార్టీ అందరిదీ.. అనే తరహాలో ఆయన వ్యవహరించిన తీరు కూడా అనన్య సామాన్యం.

అందుకే.. 40 ఏళ్ల నవయ వ్వనంలోకి అడుగులు వేస్తున్న టీడీపీకి మరిన్ని లక్ష్యాలు.. ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో పార్టీ పుంజుకోవడం అధికారంలోకి రావడమే కాదు.. వచ్చే 20 సంవత్సరాల వరకు కూడా అధికారంలో ఉండాలనే కృత నిశ్చయంతో పార్టీ అడుగులు వేస్తోంది. మరి సంకల్పం అయితే.. చెప్పుకున్నా.. దీనికి సంబంధించిన కార్యాచరణ ఎలా ఉండనుందనేది ఆసక్తిగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Discussion about this post