మొన్నటివరకు తమకు తిరుగులేదని, కుప్పంతో సహ 175 సీట్లు గెలిచేస్తామని, ఈ సారి గెలిస్తే 30 ఏళ్ల పాటు తమదే అధికారమని వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. జగన్ కూడా అదే తరహాలో మాట్లాడుతున్నారు. అయితే రాజకీయంగా ఇది కాన్ఫిడెన్స్ అనడం కంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పవచ్చు. సరే అది వైసీపీ నేతలకు వదిలేయవచ్చు.

అయితే అలా తమకు తిరుగులేదని చెబుతున్నా వారే..ఈ మధ్య టీడీపీ అధికారంలోకి వస్తే అనే మాట ఎక్కువ వాడుతున్నారు. అంటే టీడీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు వచ్చే పథకాలు రావని, వాలంటీర్ వ్యవస్థని తీసేస్తారని, రాజధాని మళ్ళీ అమరావతికే వెళుతుందని ప్రచారం చేస్తున్నారు. అంటే ఈ సారి టీడీపీకి అధికారం దక్కే అవకాశాలు ఉన్నాయని వైసీపీ నేతలే భావిస్తున్నట్లు ఉన్నారు. అందుకే ఈ రకంగా అయిన టీడీపీని నెగిటివ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే పథకాలు పోతాయనే అంశాన్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నారు.

దీనిపై ఇప్పటికే టీడీపీ క్లారిటీ ఇచ్చింది..ఇంతకంటే మెరుగ్గా పథకాలు అమలు చేస్తామని చెబుతున్నారు. అటు వాలంటీర్లు అంటే సొంత వైసీపీ కార్యకర్తలే. మరి వారు కూడా ఓటు వేయరని వైసీపీ నేతలు అనుకున్నట్లు ఉన్నారు. అందుకే టీడీపీ వస్తే వాలంటీర్ ఉద్యోగాలు పోతాయని ప్రచారం చేస్తున్నారు. అంటే వాలంటీర్లు టీడీపీకి ఓటు వేయకూడదనే కాన్సెప్ట్. ఇక రాజధాని అంశం. అసలు ఈ విషయంలో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిందే వైసీపీ అనే భావన చాలావరకు ఉంది. కాబట్టి ఈ అంశంలో వైసీపీ ఎంత ప్రచారం చేసిన ప్రజలు నమ్మే పరిస్తితి లేదని అంటున్నారు.
